Neglect Of NHAI-216 Construction Of ByPass Road: ఇది కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మీదుగా వెళ్తున్న 216వ జాతీయ రహదారి. రెండేళ్ల నుంచి పంట పొలాల మధ్యగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు రైతులకు శాపంగా మారాయి. పెదప్రోలు, కొక్కిలిగడ్డ, కాసానగర్, కప్తానుపాలెం, చల్లపల్లి, మాజేరు పరిసర గ్రామాల్లో గతంలో మురుగునీరు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ ఉండేది. జాతీయ రహదారి నిర్మాణంతో అది పూడిపోయింది. దీని వల్ల నీరు పోయే మార్గం లేక పంట పొలాలు తరచూ నీటమునుగుతున్నాయి. మాండౌస్ తుపానుతో ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 3 వేల ఎకరాల్లోని వరి పొలాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది. ఫలితంగా అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు.
సరైన డ్రైనేజీ లేకపోవడం వల్ల ఎగువ గ్రామాల్లోని మురుగంతా వచ్చి పెదప్రోలు దగ్గర పొలాల్లోకి చేరుతుందని అన్నదాతలు వాపోతున్నారు. జాతీయ రహదారి నిర్మిస్తున్న గుత్తేదారు నిర్లక్ష్యంతో మూడేళ్లుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను పరిశీలించేందుకు వచ్చిన కృష్ణా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి పక్కా డ్రైన్ కట్టి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. అన్నదాతల బాధలు విన్న కలెక్టర్ గుత్తేదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: