రాష్ట్రంలో మండలాల వారీగా జనాభా, పని భారం ఆధారంగా కొత్తగా మండలాలు, అదనపు సిబ్బందిని మంజూరు చేయాలని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ ముఖ్యమంత్రి జగన్‌ను కోరింది. జనాభా, పని భారాన్ని బట్టి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో అవసరమైన చోట ఆఫీసులు, సిబ్బందిని పెంచాలని అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.
అవసరమైతే రాష్ట్ర స్థాయిలో..
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు అవసరమైతే రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలన్నారు. కార్యాలయాల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కోరారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ బలోపేతం కోసం చేపట్టాల్సిన సంస్కరణల గురించి, రెవెన్యూ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సీఎంకు వివరించారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం అవలంబించాల్సిన విధి విధానాలను ముఖ్యమంత్రికి విడివిడిగా మెమోరాండంలను సమర్పించినట్లు ఆయన తెలిపారు.
సహేతుకంగా జరగట్లేదు..
శిథిలావస్థకు చేరుకున్న పాత మండల, డివిజన్ రెవెన్యూ కార్యాలయాల స్థానంలో కొత్త కార్యాలయాల నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ కార్యాలయాలపై ఏసీబీ దాడులు సహేతుకమైన కారణాలతో జరగడం లేదని సీఎంకు తెలిపారు.
ఆ ఉత్తర్వులను సవరించాలి..
"జనరల్ ఆఫీస్ ప్రొసీజర్" పై అనుసరిస్తున్న విధానాలు వాటి పరిధిలోనిది కానందున, నిజాయితీ పరులైన ఉద్యోగులను కూడా ఇటువంటి దాడులు భయబ్రాంతులకు గురిచేసే విధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్యోగి దగ్గర ఉండాల్సిన కనీస నగదు రూ.500ల మించి నగదు ఉండకూడదనే నిబంధన 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వులని సీఎంకు వివరించారు.
కనీస మొత్తం రూ.5000 వరకు..
ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా వాహనాలకు పెట్రోలు, మరమ్మతుల ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, ప్రోటోకాల్ తదితర ఖర్చులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా తహశీల్దార్ కార్యాలయంలో ఎలాంటి డబ్బుల లావాదేవీలు ఉండవు కనుక, ఉద్యోగి దగ్గర ఉండాల్సిన కనీస నగదు నిబంధన రూ.500 నుంచి రూ.5000కు పెంచాలని కోరినట్లు వెల్లడించారు.
సాధారణ పనివేళల్లోనే..
జిల్లా ఉన్నతాధికారులంతా సాధారణ పనివేళ్లలోనే టెలి కాన్ఫరెన్స్ , వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే వీటి పరిష్కారానికి చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డిని అదేశించినట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.