నవోదయ పబ్లిషర్స్ అధినేత అల్లూరి రామ్మోహనరావు(86)... విజయవాడలోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో రెండేళ్లుగా ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. తన సంస్థ పేరే ఇంటి పేరుగా రామ్మోహనరావుకు స్థిరపడిపోయింది. 1934 ఆగస్టు 1న జన్మించారు. తన 26ఏళ్ల వయసులో పుస్తక ప్రపంచంలోకి అడుగుపెట్టిన రామ్మోహనరావు... ఆరు దశాబ్దాలకు పైగా ఇదే రంగంలో ఉన్నారు. 1960లో నవోదయ పబ్లిషర్స్ను ప్రారంభించారు. విజయవాడతో పాటు గుంటూరు, మద్రాసులోనూ శాఖలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన పుస్తక విక్రయ సంస్థగా నవోదయ ఓ వెలుగు వెలిగింది. శ్రీశ్రీ, రావిశాస్త్రి, నండూరి రామ్మోహనరావు, ముళ్లపూడి వెంకటరమణ, బాపూ వంటి అనేక మంది దిగ్గజ రచయితల పుస్తకాలు ఇక్కడ నుంచే ప్రచురితమయ్యేవి. 1989లో పుస్తక మహోత్సవాలను ఆరంభించటంలో రామ్మోహనరావు కీలకంగా వ్యవహరించారు. వరుసగా ఐదేళ్లు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. విజయవాడలోని ఐదో నంబరు రోడ్డులో ఉన్న ఇంటి వద్దే పార్ధివదేహాన్ని ఉంచారు.
ఇదీ చదవండి: 'రూ.10 లక్షలు పైబడి లావాదేవీల కోసం ఎస్బీఐ సంపద నిర్వహణ కేంద్రాలు'