ఏపీపీఎస్సీని వైకాపా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మార్చేసి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇసుక, మద్యం, గ్రూప్ 1.. కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కనీస విద్యార్హత లేని వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించారని ఆగ్రహించారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అభ్యర్థులతో లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చినందున ఎలాంటి అధ్యయనం లేని డిజిటల్ మూల్యాంకనం ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఎంపికైన అభ్యర్థుల పేర్లు, మార్కులు, జవాబు పత్రాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాంకనం సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ తెదేపా అండగా ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: