బంగారం కుదవపెడితే గోల్డ్‌కాయిన్ ఇస్తామని ఆశ చూసి.. మొత్తం ఆభరణాలనే దోచేసిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మేనేజర్ వైనం గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పటమట తోటవారి వీధికి చెందిన సౌమ్య గత ఏడు సంవత్సరాలుగా హైస్కూల్ రోడ్డులోని బంగారం ఫైనాన్స్ చేసే సంస్థలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట బ్రాంచి మేనేజర్ వీరబాబు ఇంకా బంగారాన్ని కుదవపెడితే గోల్డ్‌కాయిన్ బహుమతిగా అందిస్తున్నట్లు ఆమెకు తెలిపారు. దీంతో సౌమ్య రెండు విడతలుగా 300 వందల గ్రాముల ఆభరణాలను తెచ్చి ఉంచారు. అయితే ఇటీవల ఆమె బ్రాంచిలోని నూతన మేనేజర్‌ను కలిసి విషయాన్ని అడగగా, అలాంటి బహుమతులు ఇవ్వడం లేదని, గత మేనేజర్ వీరబాబు తమిళనాడుకు బదిలీ అయ్యారని చెప్పారు. బంగారం కుదవ పెట్టిన సంగతి విచారించగా, వాటికి సంబంధించి వివరాలు ఏమీ లేవన్నారు. ఇదంతా సంస్థకు సంబంధం లేకుండా పాత మేనేజర్ చేశారని తేలింది. దీంతో బాధితురాలు గురువారం పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరికొందరు ఇలాగే మోసపోయినట్లు తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు 2.750 కిలోల బంగారం ఇలా కొట్టేశాడని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి