ఎన్నార్సీ బిల్లుపై కృష్ణా జిల్లా నూజివీడు పట్టణం షాదీఖానా సమావేశ మందిరంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ముందుకు వెళ్లాలనుకుంటే ప్రధాని మోదీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడని వైకాపా కన్వీనర్ పగడాల సత్యనారాయణ విమర్శించారు. సుప్రీంకోర్టు అయోధ్యపై ఇచ్చిన తీర్పుని ఏ ఒక్క ముస్లిం వ్యతిరేకించలేదన్న నిజాన్ని మోదీ గుర్తించలేదన్నారు. భాజపా నాయకులు బుద్ధి తెచ్చుకుని భారతీయుల అభీష్టం మేరకు పరిపాలన కొనసాగిస్తే వేగవంతమైన అభివృద్ధి చూడగలుగుతామని అన్నారు.
విజయవాడలో
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ బిల్లు వల్ల జరిగే నష్టాలు తెలుసుకున్న సామాన్య ప్రజలు కూడా తమకు మద్దతు తెలిపారని ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు తెలిపారు.
కడప జిల్లాలో
కడప జిల్లా రాయచోటిలో పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ మైనార్టీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తెదేపా నేతలు దీక్షా శిబిరం వద్దకు వచ్చి మైనార్టీలకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు మైనార్టీలకు తెదేపా అండగా నిలుస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.