Musical fountain at Hussain Sagar: హైదరాబాద్ నగరంలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన హుస్సేన్‌సాగర్ వద్ద మరిన్ని సొబగులు అద్దనున్నారు. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో త్వరలోనే సాగర్ మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో అందుబాటులోకి రానున్నాయి. ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే నెలలోనే కొత్త సచివాలయం ప్రారంభించనున్నారు. అదే నెలలో అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ అందుబాటులోకి తేనున్నారు. వెరసి ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డుకు కొత్త కళ రానుంది.
ఇవీ విశేషాలు:
- గతంలో బహిరంగ స్థలంలో ఇలాంటి షోలు నిర్వహించేవారు. తొలిసారి నీటిలోనే మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్‌షో ఏర్పాటు పర్యాటకులు, సందర్శకులకు కొత్త అనుభూతి ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ రూ.17.02 కోట్ల వరకు వెచ్చిస్తోంది.
- కొత్త సచివాలయం, అంబేడ్కర్ భారీ విగ్రహం, అమరవీరుల స్థూపం అన్ని ఒకేచోట రానుండటంతో ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారనుంది.
- లేజర్ షోలో హైదరాబాద్ చరిత్ర, తెలంగాణ చరిత్ర.. నాటి ఘట్టాలు పొందుపర్చనున్నారు. ఈ షోకు లుంబినీ పార్కులో ప్రత్యేక టిక్కెట్ వసూలుచేసేవారు. ఇకనుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో నిల్చుని ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు.
- రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు 20 నిమిషాల వంతున మూడు షోలు ఉంటాయి. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో నాలుగు షోలు ఏర్పాటుచేస్తారు.
- ఫౌంటెయిన్‌లో 180 మీటర్ల వెడల్పున 700 నాజల్స్‌తో 3-30 మీటర్ల ఎత్తు వరకు జలాలు పైకి ఎగజిమ్ముతూ కనువిందు చేయనున్నాయి. సాగర్‌లో పడవపై తిరుగుతూ కూడా ఈ షో చూసే అవకాశం కల్పించనున్నారు. దీంతో ఇక సాగర్ వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: