తన ప్రాణం పోతున్నా బిడ్డకు ఆయువు ప్రసాదించే తల్లి... బిడ్డ ప్రాణం పోతుందంటే చూస్తూ ఊరుకుంటుందా! ఓ తల్లి తన శరీరంలో కాలేయంలోని కొంత భాగాన్ని ..కుమారుడుకి అందించి..చిన్నోడి ప్రాణాన్ని కాపాడింది.
కృష్ణా జిల్లా పెడన వీరభద్రపురానికి చెందిన వాసా కుమారస్వామి, మధులత దంపతులకు ఇద్దరి కుమారుల సంతానం. ఈ కుటుంబానికి చేనేత వృత్తే ఆధారం. పెద్దకుమారుడైన రేవంత్(8) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఉల్లాసంగా ఉండాల్సిన ఆ బాలుడు గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆ తల్లిదండ్రులు కలత చెంది వైద్యులకు చూపించినా ఫలితం దక్కలేదు. విజయవాడలోని ఓ వైద్యుడికి చూపించారు. ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేయాలని అక్కడ సూచించారు.సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు బాలుడు ఎక్యూట్ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు నిర్థరించి వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. ఈ శస్త్రచికిత్సకు దాదాపు రూ.20లక్షల వరకు ఖర్చవుతాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాలేయాన్ని ఇచ్చే దాతను కూడా సిద్ధం చేసుకోవాలని గత జూలైలో సూచించారు. అంతమొత్తం భరించే ఆర్థిక స్థోమతలేని ఆ కుటుంబం దిగాలుగా పెడనకు తిరిగివచ్చింది. కుమారుడ్ని బతికించుకొనేందుకు రెండు ప్రధాన సమస్యలు ప్రతిబంధకంగా మారటంతో తల్లడిల్లింది. కుమారుడికి అవయవ దానం చేసేందుకు తల్లి ముందుకొచ్చి అంగీకారం తెలిపింది. రెండోది ఆర్థిక సమస్య.. దీని పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్‌ను వైకాపా నేత బండారు మల్లికార్జునరావు ద్వారా ఆ కుటుంబం సంప్రదించింది. తక్షణం స్పందించిన ఆయన సీఎం సహాయ నిధి నుంచి రూ.10లక్షలను విడుదల చేయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ప్రొసీడింగ్‌లను బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే విజయవాడలో అందజేశారు. ఈ ప్రతిని ఆస్పత్రికి అందజేయగా గత శనివారం తల్లీకొడుకులకు శస్త్ర చికిత్స చేశారు. అమ్మ నుంచి 40శాతం కాలేయాన్ని తొలగించారు. పూర్తిగా తొలగించిన కుమారుడి కాలేయ స్థానంలో అమర్చారు. ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నారని తండ్రి కుమారస్వామి చెప్పారు.
పూర్తిస్థాయిలో కోలుకొనేందుకు ఇంకనూ మూడ్నెళ్లకు పైగా పడుతుందని అంటున్నారు. సీఎం సహాయనిధి నుంచి రూ.10లక్షలు మంజూరైనప్పటికీ ఈ కుటుంబాన్ని ఆర్థిక బాధలు వీడటంలేదు. ఏ రోజుకు ఆ రోజు ఆదాయంపై జీవించే ఈ కుటుంబానికి మరో రూ.10లక్షలు సేకరించటం ఆర్థిక భారంగా మారింది.
ఇదీ చూడండి. పండుటాకుల కన్నీటి కథ…