చదివింది డిగ్రీ.. మార్కెటింగ్ ఉద్యోగం చేశాడు. ఎంతటివారినైనా క్షణాల్లో బుట్టలో వేస్తాడు. ఈ చలాకీతనాన్ని దుర్వినియోగం చేస్తూ.. అమాయకుల నుంచి డబ్బు దోచుకోవటాన్ని ప్రారంభించాడు... విజయవాడ భవానీపురానికి చెందిన రామ్ గోపాల్. చివరికి మోసాలనే తన ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో స్థానిక మసీదు సెంటర్లోని ఓ అంతర్జాల కేంద్రానికి ప్రతిరోజూ వెళ్తూ... యజమాని సత్య తో తాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. స్వచ్ఛభారత్ పథకంలో జిల్లాల వారీగా తాత్కాలిక ఉద్యోగులు అవసరమని..ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని సత్యను నమ్మించాడు .అతని ద్వారా మరో 15 మందిని పరిచయం చేసుకుని 52 లక్షల రూపాయలను వసూలు చేసి పరారయ్యాడు . బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో రామ్ గోపాల్ పాపాల చిట్టా బయటపడింది. ఈ మోసగాడు ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. విలాసవంతమైన జీవితం, విమానాల్లో విహారయాత్రల కోసం అడ్డదార్లు తొక్కాడని దర్యాప్తులో గుర్తించారు.
ఒకప్పుడు మోసపోయాడు... ఇప్పుడు మోసం చేస్తున్నాడు
రామ్ గోపాల్ విశాఖ ,రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ,హైదరాబాద్ ,ప్రకాశం జిల్లాల్లో మొత్తం 128 మంది బాధితుల నుంచి కోటి రూపాయల మేర నగదు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను... తక్కువ వడ్డీకి రుణాలప్పిస్తానని రైతులను మోసం చేసి పరారయ్యాడు. ఇలా ప్రతీచోట ఒక్కొక్క పేరుతో ఒక్కో అవతారమెత్తే ఈ కిలాడీ... మొదట మరో వ్యక్తి చేతిలో మోసపోయాడు. ఆ క్షణం నుంచీ నేరస్తుడిగా మారాడు. మార్కెటింగ్ ,ఫైనాన్స్ రంగంలో ఉద్యోగాలు చేసి వాటిలో లొసుగులను గుర్తించాడు. డబ్బు ఎరవేసి ఎదుటి వ్యక్తి ఎలా దోచుకోవాలో నేర్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి 16 లక్షల విలువ చేసే నగదు, నగలు, నకిలీ స్టాంపులు, ధ్రువపత్రాలు ,ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల కోసం డబ్బులిచ్చి మోసపోద్దని పోలీసులు సూటించారు.