MLA quota MLC Election : రాష్ట్రంలో 7స్థానాలకు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం అంశం రసవత్తరంగా మారింది. 7స్థానాలకు 8మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో పోటీ అనివార్యమైంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యత ఓట్లు కావాల్సి ఉన్నందున.. విప్ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్‌లో ఏ ఓటు ఎటు పడుతుందనే ఉత్కంఠ చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో 7ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 23న ఎన్నిక జరగనుంది. అధికార వైఎస్సార్సీపీ సాంకేతికంగా 6స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా.. 7స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. ప్రతిపక్ష టీడీపీ.. సాంకేతికంగా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నా.. నైతిక మద్దతు లేమి కారణంగా తటపటాయిస్తూనే తమ అభ్యర్థిగా బీసీ మహిళ పంచుమర్తి అనురాధను ఎన్నికల బరిలో నిలబెట్టింది.
ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం సభ్యుల సంఖ్యను ఖాళీ స్థానాలకు అదనంగా ఒకటి జోడించి భాగించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులున్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో ఆయా పార్టీల బలబలాలను చూస్తే అధికార వైఎస్సార్సీపీ కి 151 మంది సభ్యుల బలం ఉంది. ఈ బలం ఆరుగురు సభ్యులను మాత్రమే గెలిపించుకునేందుకు ఉపయోగపడుతుంది. కానీ, 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ వైఎస్సార్సీపీలో చేరారు. వీరితోపాటుగా జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైఎస్సార్సీపీతోనే ఉన్నారు. దీంతో తమకు నైతికంగా 156 మంది సభ్యుల బలం ఉందని వైఎస్సార్సీపీ చాటుకుంటోంది.
అయితే అధికార వైఎస్సార్సీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేల ముసలం వేధిస్తోంది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం తాము ఓటు వేస్తామని ఇద్దరూ బహిరంగంగానే స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్జి.. మంత్రులకు గట్టిగానే క్లాస్ పీకేంత పనైంది. ఏడుగురు అభ్యర్థులను గెలిపించకపోతే మంత్రి పదవులు ఊడతాయంటూ తాజా మంత్రివర్గ సమావేశంలో గట్టి హెచ్చరికలే జారీ చేశారు. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటెయ్యాలంటూ టీడీపీ ఇస్తున్న పిలుపునకు అనుగుణంగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా బయట పడటం వైఎస్సార్సీపీలో తలనొప్పిగా మారింది.
శాసన సభ్యుల కోటా ఎన్నికల్లో నా అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తాను. ఎవరేం చెప్పినా నా అంతరాత్మ ప్రకారమే ఓటు వేస్తాను అని స్పష్టంగా చెప్తున్నాను. మిగతా సభ్యులు కూడా అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయండి అని సలహా ఇస్తున్నా. - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
ఇవాళ అన్ని వ్యవస్థలు దిగజారుతున్నాయి. విలువలు లేని వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆలాంటి పరిస్థితిపై మాట్లాడడం, తర్కించుకోవడం అనవసరం. అధికారులు, పోలీసులు, ఐఏఎస్ అధికారులు తమ విధులు నిర్వర్తించడంలో దిక్కలేని స్థాయికి దిగజారిపోయారు. ఎన్నికల నిర్వహణ నవ్వుల పాలవుతోంది. ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలి. 40 ఏళ్ల కిందటే ఈ దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ చెప్పినట్టుగా అంతరాత్మ ప్రబోధంతోనే నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. నా తుది శ్వాస ఉన్నంత వరకు.. నేను వినియోగించుకునే చివరి ఓటును కూడా అంతరాత్మ ప్రబోధంతోనే వేస్తాను. - ఆనం రామనారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే
వైఎస్సార్సీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుంటే వారికున్న మిగిలిన బలం 154మంది ఏడుగురు సభ్యులకు సరిగ్గా 22ఓట్లు వేసుకోవచ్చు. అయితే ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైఎస్సార్సీపీలో కనిపిస్తోంది. ఎవరైనా గైర్హాజరైనా లేదా, చెల్లని ఓటు వేసినా లెక్కలు తారుమారయ్యే ప్రమాదమూ పొంచి ఉంది. అటు టీడీపీ మాత్రం అంతరాత్మ ప్రబోధానుసారం తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు వైఎస్సార్సీపీ నుంచి ఓటు వేసేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇవీ చదవండి :