కృష్ణా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను కొవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి కొవిడ్ కేసులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సెకండ్ వేవ్ కొవిడ్ కేసుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని.. అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చేయాలన్నారు. కొవిడ్ కేసులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంలోను.. పరీక్షలు నిర్వహించడంలోనూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి కమిటీ నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైద్యం కోసం వచ్చేవారికి ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆక్సిజన్, ఇతర అత్యవసర మందులను తగినంతగా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
ధరల వివరాలు ప్రదర్శించండి..
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితుల నుంచి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ధరల వివరాలను ఆయా ఆసుపత్రుల్లో ప్రదర్శించేలా చూడాలని ఆయన కోరారు. ఐవీ ప్యాలెస్ వంటి భవనాలను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చి ప్రజలకు మేలైన వైద్య సహాయం అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కొవిడ్ స్పెషల్ ఆఫీసర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె. సునీత, కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్, సంయుక్త కలెక్టర్లు డాక్టర్ మాధవలీత, ఎల్. శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: