Minister Peddireddy Ramachandra Reddy : వేసవిలో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టినట్టు ఏపీ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడా కోతలు లేకుండా చూసేందుకు ముందస్తు ప్రణాళికలు చేపట్టామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 246 మిలియన్ యూనిట్లకు పెరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 కేవీ సబ్ స్టేషన్ల నిర్వహణ, ఏర్పాటుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.
అధికారులతో మంత్రి సమీక్ష... సచివాలయంలో విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన అధికారులతో మంత్రి వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. రైతులు, జెడ్పీటీసీ, ఎంపీపీలతో కూడిన కమిటీలు సరఫరా ఇబ్బందులు తలెత్తినప్పుడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. మరోవైపు విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో కుదిరిన ఎంఓయూలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటయ్యేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాల్సిందిగా సూచనలు చేశారు.
శంకుస్థాపనలకు ఏర్పాట్లు.. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి 16,500 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యంతో రూ.82,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 10 ప్రాజెక్టులకు జులై 15 లోగా శంకుస్థాపనలు చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. మరోవైపు కాలుష్య నియంత్రణకు సంబంధించి బయోవ్యర్ధాల నిర్వహణపైనా మంత్రి అధికారులతో సమీక్షించారు. ఏటా ఏపీలో 7197 టన్నుల బయో వ్యర్ధాలు ఉత్పన్నం అవుతున్నట్టు తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.
ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎన్ఆర్ఈడీసీ ఆధ్వర్యంలో 250 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మ వారి ఆలయ సమీపంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్కాస్ట్ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ.. 2070 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించేలా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఉంటుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా విధాన రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ ప్రాతిపదికన ఒక లక్ష ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ, రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు లాంటి ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నట్టు వివరించారు.
ఇవీ చదవండి :