జగన్ ఏడాది పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న ఆరోపనలు నిజం లేదని.. వాటిపై బహిరంగ చర్చకు తాము సిద్దమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వంపై బురద జల్లేందుకు తెదేపా కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం దీవాళా తీసిందని మాట్లాడటం సరైంది కాదన్న ఆయన.. ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలపై 50 వేలకోట్ల పన్నువేశారని ,80 వేల కోట్లు అప్పులు తెచ్చామన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఐదేళ్లపాలన.. జగన్ ఏడాది పాలనపై ప్రజల మధ్య బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టింది చంద్రబాబు ప్రభుత్వమని ఆరోపించారు. 96 వేలకోట్లతో రాష్ట్రం విడిపోతే.. చంద్రబాబు అధికారం నుంచి దిగే నాటికి 2 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఆర్టీసీలో కొద్ది శాతం ఛార్జీలు పెంచారు తప్ప.. ఏ రంగంలోనూ ఛార్జీలు, పన్నులు పెంచలేదని మంత్రి స్పష్టం చేశారు. మహానాడులో చేసిన 7 తీర్మానాల్లో వాస్తవాలు లేవన్నారు. ఏడాది కాలంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థంగా ప్రభుత్వం అమలు చేస్తోందన్న మంత్రి.. భారత దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.
ఇదీ చదవండి: తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: సుబ్బారెడ్డి