కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని ఎడ్లలంక, పులిగడ్డ, బందలాయి చెరువు, వెకనూరు గ్రామాల్లో ఉన్న లంక భూముల్లో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తారు. కృష్ణానది పక్కనే ఉండటం వలన వరదలు వచ్చినప్పుడు వేరే పంటలు ఏమైనా వేస్తే నష్టపోయే అవకాశం ఉన్నందున రైతులు మామిడి సాగుకు మొగ్గుచూపుతారు. సాగునీరు లేకపోయినా వర్షాల మీద ఆధారపడి 10 దశాబ్దాలుగా ఇక్కడ మామిడి సాగవుతోంది.
పైన బాగు.. లోపల డాగు..!
5 సంవత్సరాలుగా మామిడికి పండు ఈగ వలన తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ పురుగు ఆశించిన పండు చూడ్డానికి పైకి బాగానే ఉన్నా... కాయను కోస్తే లోపల పురుగులు ఉంటాయి. ఈగ కాటు వేయగానే కాయపై మచ్చ ఏర్పడుతుంది. కొద్దిరోజులకు చెట్టు నుంచి రాలిపోతుంది. కాయ బాగానే ఉందికదా అని వ్యాపారులు కొన్నా.. కోసి చూసి పురుగులు ఉండటంతో తిరిగి తెచ్చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ఇలాంటివి వేల కాయలు పారబోస్తున్నామన్నారు.
పెట్టుబడి రావడంలేదు...
ఈగ బారి నుంచి మామిడి కాయను కాపాడుకోవటానికి కొందరు మందు బిళ్ళలను చెట్టుకు వేలాడదీస్తున్నారు. అయినప్పటికి పండు ఈగ ఉద్ధృతి తగ్గడం లేదు. ఉద్యానశాఖ వారు కాయకు కట్టుకునే కవర్లు కూడా ఇవ్వడం లేదని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి రూ. 70వేల వరకు పెట్టుబడి అవుతోందని.. ఈగ వలన రూ. 30వేలు కూడా రావటం లేదంటున్నారు. అసలే లాక్ డౌన్ ప్రభావంతో బయట మార్కెట్లకు వెళ్లడంలేదని.. సరైన ధర రావడంలేదని వాపోతున్నారు. ఇప్పుడీ ఈగ వలన మరింత నష్టం వాటిల్లుతోందని చెప్పారు.
ఇవీ చదవండి.. 'బ్లీచింగ్ పౌడర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి'