కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను కుమారుడు ప్రసాద్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకున్నాడన్న ఆరోపణలతో.. జైలుకు తరలించారు. ఆ రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రసాద్... హైదరాబాద్ హైటెక్స్ కమాన్ వైపు నుంచి నిబంధనలు అతిక్రమించి కారు నడిపాడు. ఖానామెట్ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కృష్ణ వారిని అడ్డుకున్నాడు.
కారులోంచి దిగిన ప్రసాద్... కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. నన్ను నువ్వు అని సంభోదిస్తావా అంటూ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడాడు. రోడ్డుకు అవతలివైపు విధులు నిర్వహిస్తున్న మాదాపూర్ సీఐ రాజగోపాల్‌రెడ్డి అక్కడకు చేరుకుని వారించే ప్రయత్నం చేశారు. సామినేని ప్రసాద్ వినకపోవడం వల్ల స్టేషన్‌కు రావాల్సిందిగా ఇన్స్పెక్టర్ కోరారు.
నన్న స్టేషన్‌కు రమ్మంటావా అంటూ ఇన్స్పెక్టర్ను పక్కకు నెట్టి... కాలుతో తన్ని దూషించాడు. విధులు నిర్వహిస్తున్న మిగతా పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తనయుడిపై 332, 353,506 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు