Mp Balasouri Follower : అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబుతో పాటు, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అనుచరుడు గరికపాటి శివ పోలీసులను కోరారు. నాగాయలంకలో మత్స్యకారులకు రుణ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనపై దాడి చేశారని ఎస్పీ జాషువాను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. గత కొన్ని వారాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తన మొబైల్కు సందేశాలు పంపిస్తున్నారని.. పథకం ప్రకారమే నాగాయలంకలో తనను హతమార్చాలని ప్రయత్నించారని ఆరోపించారు.
పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే కుమారుడు వివేక్, మేనల్లుడు దామోదర్, ఎంఏసీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, మరికొందరు వైసీపీ నేతలు విచక్షణారహితంగా తనపై దాడిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి అన్ని వివరాలను పోలీసులకు అందించానని అన్నారు. తన ఫిర్యాదును అవనిగడ్డకు బదిలీ చేశారని.. తనకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆయన అన్నారు.
ఇవీ చదవండి :