కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు చౌర్య నిరోధక బృందం తనిఖీల్లో పలు కేసులు వెలుగుచూశాయి. గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గినా.. కేసులు బయటపడుతూనే ఉన్నాయి.
* జిల్లాలో మొత్తం 16,46,258 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఎల్‌టీ కనెక్షన్లు 16,44,905 కనెక్షన్లు కాగా.. మిగిలిన 1,353 హెచ్‌టీ కనెక్షన్లు. గృహ సంబంధ కనెక్షన్లలో ఈ జాఢ్యం ఎక్కువగా ఉంది. మీటర్లను ట్యాంపరింగ్ చేయడం, నేరుగా విద్యుత్తు తీగల నుంచి తీసుకోవడంతో పాటు విభాగాల్లో మార్పులు చేసుకోకుండానే వినియోగించుకుంటున్నారు. చౌర్యం కారణంగా తరచూ సరఫరాలో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి.
* 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు మొత్తం 33,912 సర్వీసులను తనిఖీ చేశారు. వీటిలో 759 చోట్ల చౌర్యం జరుగుతున్నట్లు వెలుగుచూసింది. 2,907 తనిఖీల్లో పరిమితికి మించి ఎక్కువ లోడ్ వాడుతున్నట్లు తేలింది. అదనపు లోడు కూడా విద్యుత్తు శాఖను ఇబ్బంది పెడుతోంది.
* కొవిడ్ కారణంగా పెద్దగా తనిఖీలు జరగలేదు. రెడ్ జోన్లలో ఎక్కువ ప్రాంతాలు ఉండడంతో పరిమితంగానే చేపట్టారు. సెప్టెంబరు నుంచి పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. నాలుగు నెలల్లోనే రూ.1.34 కోట్లు వరకు రాబడికి గండి పడిందని గుర్తించి, జరిమానా విధించారు. ముసునూరు, మైలవరం ప్రాంతాల్లో కోళ్లఫారాల్లో మీటర్లను తిరగకుండా చేసిన ఘటనలు బయటపడ్డాయి. మొత్తం 30 కేసులు నమోదు చేసి రూ.6లక్షలు జరిమానా విధించారు. గుడివాడ ప్రాంతంలో చేపల చెరువుల వద్ద నేరుగా మెయిన్ లైన్‌కు కొక్కెం వేసి తీసుకుంటున్నవి గుర్తించి 3కేసులు పెట్టారు. జగ్గయ్యపేట, నందిగామ, ముసునూరు ప్రాంతాల్లో మీటర్లను బైపాస్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఏసీ, గీజర్లు వాడే సమయంలో ఇలా చేస్తున్నట్లు గుర్తించారు. పెనుగంచిప్రోలు, నాగాయలంక, ముదినేపల్లి ప్రాంతాల్లో మీటర్లను మార్చుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బహిర్గతమైంది.
ఇదీ చదవండి: పాఠశాల్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలి: సీఎం