దళితులపై జగన్ ప్రభుత్వం దమనకాండ కొనసాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో అధికార పార్టీ నాయకుడి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు.. దళిత యువకుడు వరప్రసాద్‌ని చిత్రహింసలకు గురిచేసి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చెయ్యడం ఘోరమని మండిపడ్డారు.
అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ.. ఇసుక మాఫియాని నిలదీసిన దళిత యువకుడిపై పోలీసులే.. గూండాల్లా దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మాస్కు అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని నడిరోడ్డులో బంధించి తీవ్రంగా హింసించి.. పిచ్చోడిని చేసి చంపేయాలని చూశారని ఆరోపించారు. అవినీతికి సహకరించలేదని దళిత డాక్టర్ అనితారాణిని వేధించారని గుర్తుచేశారు. దళిత న్యాయమూర్తి రామకృష్ణపై భౌతిక దాడికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి రాజ్యంలో దళితులకు జీవించే హక్కులేదా అని లోకేశ్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఆ ఐదు జిల్లాల్లో కరోనా విజృంభణ... రికార్డు స్థాయిలో కేసులు నమోదు