లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కరోనా కేసుల నమోదు ఆధారంగా కంటైన్మెంట్ జోన్లలో మార్పులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 42 కంటైన్మెంట్ జోన్లు ఉంటే...అందులో 17 చోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాకపోవటంతో, వాటిలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించినట్లు జిల్లా కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు.
17 క్లస్టర్ల పరిధిలోని బాధితులు అంతా చికిత్స పొంది, ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరినట్లు పేర్కొన్నారు. మిగిలిన 25 కంటైన్మెంట్ కంటైన్మెంట్లలో లాక్‌డౌన్ నిబంధనలు యథావిథిగా అమలవుతాయని తెలిపారు.
లాక్‌డౌన్ నిబంధనలు అమలయ్యే వాటిలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కరోనా కేసులు అధికంగా నమోదై హాట్‌స్పాట్‌లుగా మారిన చిట్టినగర్, గాంధీనగర్, కొత్తపేట, కృష్ణలంక, మాచవరం, మొగల్రాజపురం, సత్యనారాయణపురం, సింగ్‌నగర్, విద్యాధరపురం ఉన్నాయి.
విజయవాడ మండలం పరిధిలో ఉన్న, రామవరప్పాడు, వైఎస్సాఆర్ కాలనీ, గొల్లపూడి, పెనమలూరు మండలంలో చోడవరం, కానూరు, పోరంకి, యనమలకుదురు... మచిలీపట్నం మండలం మచిలీపట్నం, నూజివీడు మండలం నూజివీడు, పొతిరెడ్డిపల్లి, గన్నవరం మండలం సూరంపల్లి, జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెం, చాట్రాయి మండలం మర్లపాలెం, ఉంగుటూరు మండలం ఆత్కూరు, ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం ఉన్నాయి.
కంటైన్మెంట్ జోన్లలో కాకుండా మిగిలిన అన్ని చోట్ల దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తెరిచేందుకు అనుమతించినట్లు కలెక్టరు తెలిపారు. ఈ ప్రాంతాల్లో సెలూన్లు తెరిచేందుకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సినిమా హాళ్లు, వాణిజ్య సముదాయాలు, సమావేశ మందిరాలు, క్రీడా ప్రాంగణాలకు అనుమతి లేదన్నారు.
బయటకొచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని- భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. చెప్పుల దుకాణాలు, వస్త్ర దుకాణాలు, ఆభరణ దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 396 మందికి కరోనా పాజిటివ్ రాగా.... 101 మంది ఇంకా ఆసుప్రతిలో వైద్యం పొందుతున్నారు. 280 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరారు. ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్లు వైద్యశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: