PM Modi Comments On Congress Royal Family : దేశాన్ని పాలించడానికే తాము పుట్టామని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తోందని, ఆ పార్టీ మనస్తత్వం అదే అని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీల అభివృద్ధి కుంటుపడడానికి కాంగ్రెస్ కారణం అని ఆరోపించారు. రిజర్వేషన్లు అంటేనే కాంగ్రెస్ చిరాకు పడుతోందని మండిపడ్డారు. 1980 దశకంలో రాజీవ్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించినప్పుడు- దళితులు, ఆదివాసీలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ప్రశ్నిస్తూ ఓ ప్రకటన ప్రచురించారని గుర్తుచేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారని, ఇది ఆ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రాపుర్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
"దేశాన్ని విచ్ఛిన్న చేయడానికి కాంగ్రెస్ ఆడుతున్న డేంజరెస్ గేమ్. ఒకవేళ ఆదివాసీలు కులాలుగా విడిపోతే వారి గుర్తుంపు, ఐక్యత విచ్ఛిన్నమవుతాయి. కాంగ్రెస్ యువరాజు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించారు. అందుకే కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రను మనం బలి కాకూడదు. మనం ఐక్యంగా ఉండాలి. మహావికాస్ అఘాడీ(ఎమ్వీఏ) అతి పెద్ద అవినీతి కూటమి. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతోంది."
--ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Chandrapur, Maharashtra: Prime Minister Narendra Modi addresses a public meeting in Chimur. pic.twitter.com/ds1HFJBX6S
— ANI (@ANI) November 12, 2024
డెవలప్మెంట్ అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు డబుల్ PhD
అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్‌డీ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మహారాష్ట్ర గత రెండున్నరేళ్లలో డబుల్ స్పీడ్‌తో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ గడ్డపై 12 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని, 100 రైల్వేస్టేషన్లను ఆధునీకరించామని వెల్లడించారు.
'మహారాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సంకల్ప పత్ర గ్యారంటీ'
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలుస్తుందనడానికి ఈ సభకు భారీ స్థాయిలో తరలివచ్చిన ప్రజలే నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. "బీజేపీ సంకల్ప పత్ర మేనిఫెస్టో, మహారాష్ట్ర అభివృద్ధికి గ్యారంటీ. దేశం మొత్త ఒకే రాజ్యాంగం ఉండేలా చేయడానికి(ఆర్టికల్ 370 రద్దును ఉద్దేశించి) ఏడు దశాబ్దాలు పట్టింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను మీరు అనుమతిస్తారా" అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
VIDEO | Maharashtra Assembly election: " congress and its allies have been politically benefiting from violence and separatism. just a few weeks ago, we saw what happened in jammu and kashmir. this region has been burning for decades due to separatism and terrorism. the law under… pic.twitter.com/AOWP3UfijV
— Press Trust of India (@PTI_News) November 12, 2024
'మోదీ ప్రచారం చేసిన చోట బీజేపీ ఓడిపోయింది'
లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించిన 10-12 చోట్ల బీజేపీ ఓడిపోయిందని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ మంగళవారం అన్నారు. "ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించడం ప్రధాని హక్కు. దానిపై అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ 16 ర్యాలీలలో ప్రసంగించారు. అందులో 10-12 చోట్ల బీజేపీ ఓడిపోయింది. కాబట్టి ఆయన్ను రానివండి" అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ సమాధానమిచ్చారు.
కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే చేసిన ఆరోపణలను శరద్ ఖండించారు. ఆయన ఎన్నికల ముందు కొంత కాలం ఆయనకు ఇంపార్టెన్స్ ఉంటుందని, కాబట్టి ఆయన్ను తాను సీరియస్గా తీసుకోనని చెప్పారు.
ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలో మహారాష్ట్రలో బీజేపీ ఎంపీల సంఖ్య 23 నుంచి 9కి తగ్గింది.