Awareness in MLAs on AP Budget : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,94,427.25 కోట్లతో పద్దును ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు. పద్దులో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ కమిటీ హాలులో శాసనసభ సమావేశాలు, బడ్జెట్ పద్దులు, చర్చలు జరిగే తీరుపై నూతన శాసన సభ్యులకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 84 మంది, రెండోసారి ఎన్నికైనవారు 39 మంది ఉండటంతో అన్ని అంశాలపై వారికి అవగాహన కల్పించింది. పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. బడ్జెట్ పద్దులు, అంశాలవారీగా చర్చించడంపై పార్లమెంట్ రీసెర్చ్ సర్వీస్ సంస్థ సభ్యులు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
AP MLAs on Budget : స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రశ్నోత్తరాల్లో అవకాశం రాకపోతే లఘు చర్చలు, జీరో అవర్‌ను సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. అవకాశం ఉన్న మార్గాలను తెలుసుకోవడం ద్వారా నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపవచ్చని దిశానిర్దేశం చేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇప్పటికీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అసెంబ్లీ రూల్స్ తెలియాలని, సభలో ఏంచేయాలి, ఏమి చేయకూడదన్నది తెలుసుకోవాలని అయ్యన్నపాత్రుడు వివరించారు.
కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు శిక్షణ ఎంతో అవసరమని కూటమి ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి గట్టెక్కించాలంటే ఎమ్మెల్యేలంతా చట్టసభను సద్వినియోగం చేసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సభా నిర్వహణలో ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు. బడ్జెట్‌కి సంబంధించిన అంశాలపై అవగాహన అవసరమని కూటమి ఎమ్మెల్యేలు వివరించారు. మరోవైపు ఈ సదస్సు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయో శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, అసెంబ్లీ నిర్వహణతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.
మహానగరికి మహర్దశ - నవ రాజధానికి రూ.3,445 కోట్లు
అభివృద్ధి, సంక్షేమాల కలబోత - ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదేలా బడ్జెట్