కృష్ణా జిల్లా నూజివీడులో ఉన్న తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని మహిళా రైతు తోటకూర గాయత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ శివారులోని వేంపాడు అగ్రహారంలో తనకు 62 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని 70 ఏళ్లుగా మూడు తరాల నుంచి తామే సాగు చేస్తున్నట్లు మహిళా రైతు వెల్లడించారు. గతంలో తన తాత పొట్లూరి లక్ష్మణస్వామి, తండ్రి పొట్లూరు రామస్వామి సాగు చేశారని, గడిచిన అయిదేళ్లుగా తాను సాగు చేస్తున్నట్లు గాయత్రి తెలియజేశారు.
స్థానికంగా ఉండే ఓ నాయకుడు కొందరిని ఉసిగొల్పి తనపై దాడి చేసి, భూమి లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. భూమిలో పనులు చేయిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి అడ్డుకున్నారని గాయత్రి నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా రైతు ఫిర్యాదుతో నూజివీడు గ్రామీణ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్ పోలీసు సిబ్బందిని పంపి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఒక మహిళపై ఇంతమంది దాడికి యత్నించటం దారుణమని, మహిళా రైతును ప్రోత్సహించాల్సిన అవసరం ఉండగా, ఇలా దాడులకు తెగబడటం ఏమిటని గాయత్రి ప్రశ్నిస్తున్నారు. తనపై దాడి జరగవచ్చని, రక్షణ కల్పించాలని గాయత్రి పోలీసులను వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి : భారత్ బంద్‌లో అమరావతి రైతులు..రాజధాని గ్రామాల్లో నిరసనలు