జిల్లాలో గతంలో మేజర్, మైనర్ పంచాయతీల వరకూ మొత్తం 980 ఉండేవి. పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక స్వరూపం, తదితర కారణాల దృష్ట్యా స్థానికంగా ఉండే ఒత్తిడి మేరకు ప్రభుత్వం కొన్నింటిని విలీనం చేయడం, మరికొన్నింటిని విభజించి నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర విభజనానంతరం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిని పెంచే క్రమంలో కొన్ని పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయడం, మచిలీపట్నం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే సమయంలో కొన్నింటిని కలపడంతో పాటు మరికొన్నింటికి నగర పంచాయతీ హోదా కల్పించింది. కొన్నింటిని కలిపి పురపాలక సంఘంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఎన్నికలకు దూరంగా..
గతంలో పంచాయతీలుగా ఉండి నగరపాలక సంస్థల్లో విలీన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న కారణంతో జిల్లావ్యాప్తంగా పందొమ్మిది పంచాయతీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. విజయవాడ రూరల్ పరిధిలో నాలుగు విభజిత పంచాయతీల్లో 2011 లెక్కల ప్రకారం ఓటర్ల జాబితాలు లేకపోవడం, జగ్గయ్యపేటలోని రెండు పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్ల పట్ల స్పష్టత లేకపోవడం, మచిలీపట్నం మండల పరిధిలోని తొమ్మిది గ్రామాలు, గుడ్లవల్లేరు మండల పరిధిలోని రెండు పంచాయతీల్లోని వార్డుల విలీన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ ఎన్నికల ప్రక్రియ లేకుండా పోయింది.
అభివృద్ధిని ఆశిస్తూ..
నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలంటే అందుకు తగ్గ జనాభా ఉండాలి. వాటిలోనే అంతర్భాగంగా ఉండే గిరిజన తండాల్లో అభివృద్ధి నామమాత్రంగా ఉండటాన్ని గమనించిన ప్రభుత్వం జనాభా ప్రాతిపదిక అంశంలో సడలింపులు ఇచ్చింది. ప్రత్యేకించి గిరిజన తండాలను నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో పది గిరిజన తండాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ఇవి ఏర్పడిన అనంతరం పాలకవర్గాల ఏర్పాటుకు తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఆయా గ్రామాల్లో ఆసక్తి నెలకొంది.
పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని కొన్ని పంచాయతీలను విడగొట్టారు. కైకలూరు మండల పరిధిలోని చటాకాయి, జి.కొండూరులో సీహెచ్ మాధవరం, విజయవాడ రూరల్‌లో గొల్లపూడి, జక్కంపూడి, వత్సవాయిలో ఇందుగుళ్లపల్లి, మైలవరంలో కీర్తిరాయునిగూడెం, రెడ్డిగూడెంలో ముచ్చినపల్లి, జగ్గయ్యపేటలో చిల్లకల్లు పంచాయతీల్లో కొంత పరిధిని వేరు చేసి నూతనంగా తొమ్మిది పంచాయతీలను ఏర్పాటు చేశారు. విభజిత నూతన పంచాయతీల్లో కొన్ని మినహా మిగిలిన వాటిల్లోనూ తొలిసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: