Lingamaneni House Attachment: ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని లింగమనేని రమేష్ ఇంటి జప్తుకు అనుమతి కోరుతూ నేర పరిశోధన విభాగం (సీఐడి) దాఖలు చేసిన పిటీషన్ పై విజయవాడ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు విచారణ జరిపింది. పిటీషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 6న దీనిపై ఉత్తర్వులు వెలువరించనుంది. మే 17న తమకు డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని లింగమనేని తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో మా వాదనలు వినాలని కోర్టును కోరారు.
క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 కి వ్యాలిడిటీ ఉందో లేదో నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందన్నారు. గతంలోనే ఈ కేసులో హైకోర్టు నుంచి లింగమనేని రమేష్ ముందస్తు బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు సీఐడీ తరపున ప్రత్యేక పీపీ వైఎన్ వివేకానంద వాదనలు వినిపించారు. అనుమతించడం లేదా తిరస్కరించడంపై ఏదో ఒక విధమైన నిర్ణయం వెల్లడించాకే ప్రతివాదులకు నోటీసు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు.
జరిగిన విషయం: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో ఉన్న లింగమనేని రమేష్‌కు చెందిన ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్నారు. అయితే రాజధాని అమరావతి నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. దాంతో పాటు, లంచం/క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారంటూ సీఐడీ ఆరోపించింది.
ఈ కేసులో భాగంగా ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి కోసం సీఐడీ విజయవాడ అ.ని.శా కోర్టులో పిటిషన్ వేసింది. మరోవైపు సీఐడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో మే 31న విచారణ జరిపింది. విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్ వివేకానంద వాదన చేశారు. ఎటాచ్‌మెంట్‌కు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. చట్ట నిబంధనల ప్రకారం పరిశీలన చేసి, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.