రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ పై పది వామపక్ష పార్టీలు విజయవాడ దాసరి భవన్లో సమావేశం నిర్వహించాయి. ఈ చర్చలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తోపాటు వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. డిసెంబరు 8న భారత్ బంద్ రోజు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని.. కార్పొరేట్ సంస్థల కోసం ఏకపక్షంగా బిల్లులు తెచ్చిందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలు చేతిలో పెట్టాలని మోదీ సర్కారు భావిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వైకాపాతో సహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. లేదంటే రైతు వ్యతిరేక పార్టీలుగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్తో సహా అనేక పార్టీలు బంద్కు మద్దతు ఇచ్చాయన్నారు. దేశంలోని అన్ని సంఘాలు ఈ బంద్ లో పాల్గొని రైతులకు అండగా ఉండాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి..