ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాట తప్పను, మడమ తిప్పను... అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్... సీఎం అయ్యాక ఛార్జీలు పెంచి రెండో యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రివర్స్ గేరులో జెట్ స్పీడులో సీఎం వెనక్కి పరుగెత్తిస్తున్నారని ట్వీట్ చేశారు. ఛార్జీల పెంపును, ప్రజలపై భారాన్ని పెంచడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వివేకా హత్యకేసులో నిందితులను ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సీరియస్గా వ్యవహరించనట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.