Advocates fire on CID : న్యాయవాదులకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని బెజవాడ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నాయంటూ న్యాయవాదులు దీక్షకు దిగారు. సీనియర్ న్యాయవాదులు సుంకర రాజేంద్ర ప్రసాద్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ సహా పలువురు న్యాయవాదులు నోటీసులు అందుకోగా.. తమ ఉద్యమాన్ని కొంత మంది అవహేళన చేస్తున్నారని న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. విషయ పరిజ్ఞానం లేనివాళ్లు ఏదో మాట్లాడుతున్నారన్న ఆయన... న్యాయపరమైన అంశాలలో న్యాయవాదులుగా తాము మాట్లాడామని స్పష్టం చేశారు.
ఎందుకంత భయం.. కేసు విచారణపై పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. పత్రికలు, మీడియాలో మాట్లాడితేనే సీఐడీ అధికారులు భయపడుతున్నారని చెప్పారు. అరెస్టు అయిన ఆడిటర్లకు కూడా 160 సీఆర్పీ నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారని, తమకు కూడా అవే నోటీసులు ఇవ్వడం వెనుక అర్థం ఏమిటని సుంకర రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అసలు తాము సాక్షులం కానప్పుడు నోటీసులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఈ కేసును సమగ్రంగా పరిశీలించినా తమకు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదన్న ఆయన.. కేవలం దురుద్దేశంతోనే ఈ నోటీసులు ఇచ్చారని వెల్లడించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే.. పోలీసులను విమర్శిస్తే నోటీసులు ఇవ్వడం ఏమిటి, ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. సుప్రీంకోర్టు కూడా విచారణలో ఉన్న అంశం పై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చు అని చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 65 సంవత్సరాలు పైబడిన, 15 ఏళ్ల లోపు, మహిళలను పిలవకూడదని కోర్టు చెప్పిందన్నారు. ఈ సెక్షన్ల గురించి తెలుసుకుని సీఐడీ అధికారులు వ్యవహరించాలన్నారు. విధి నిర్వహణలో కర్రలే కాదు... బుర్రలు కూడా ఉపయోగించి పని చేయాలన్నారు. ఇప్పుడైనా చట్టం పరిధిలో పని చేయాలని, లేదంటే తాము కూడా కేసులు వేసి, బోనులో అధికారులను నిలబెడతామని అన్నారు.
సీఐడీ పరిధి దాటొద్దు.. న్యాయవాదులు దీక్షకు వడ్డే శోభనాద్రీశ్వరావు, ఇతర జర్నలిస్టు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో తమ అభిప్రాయాలు చెప్పామని న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. న్యాయవాదులు, జర్నలిస్టుల అరెస్టులో సీఐడీ అధికారులు అత్యుత్సాహంతో పని చేస్తున్నారని మండిపడ్డారు. తమకు తెలిసిన అంశాల పై మాట్లాడితే నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ప్రాథమిక దశలో అందరినీ అరెస్టు చేయడం తప్పు అని చెప్పామని, దీనికి న్యాయవాదులకు నోటీసులు ఇచ్చి రావాలని చెప్పడం సమంజసమా అని ప్రశ్నించారు.
న్యాయవాదులకు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటే ఎవరు అభిప్రాయాలు చెబుతారని నిలదీశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయవాదులు నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. ఏదైనా ఘటన జరిగితే న్యాయవాదుల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీలు వేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అభిప్రాయాలు చెప్పకూడదని ఆంక్షలు పెట్టే హక్కు పోలీసులకు లేదని, తాము ఎక్కడా అసభ్యపదంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. దశాబ్దాలుగా తాము ఎన్నో చర్చల్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పామన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. సీఐడీ అధికారులు తమ పరిధిని దాటి నోటీసులు ఇస్తున్నారని,160సీఆర్పీ నోటీసులు సీఐడీ నియంతృత్వానికి తార్కాణమని గొట్టిపాటి స్పష్టం చేశారు. దీనిపై భవిష్యత్తు లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
విధుల బహిష్కరణ.. న్యాయవాదులకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ కోర్టు విధులు బహిష్కరించింది. కోర్టు ప్రాంగణంలో బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ధర్నాకు దిగారు. ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయంటూ నినదించారు. ఈ నిరసనలో సీనియర్ న్యాయవాదులు చలసాని అజయ్ కుమార్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, సుంకరి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఐడీ నోటీసులకు వ్యతిరేకంగా మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, తిరువూరు ఏలూరు, కొవ్వూరు తదితర కోర్టుల్లోనూ న్యాయవాదులు నిరసన తెలిపారు.
న్యాయపరంగా ఎదుర్కొంటాం.. మార్గదర్శి విషయంలో సీఐడీ వ్యవహారంపై చర్చలో పాల్గొన్న న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లకు సీఐడీ నోటీసులు ఇవ్వడం దారుణమని మచిలీపట్నం బార్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. సీఐడీ చర్యలను నిరసిస్తూ సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఇతర న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని భయపెడుతున్నట్లుగా... న్యాయవాదులను సీఐడీ భయపెట్టాలనుకోవడం అవివేకమన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
హై కోర్టులో పిటిషన్... మార్గదర్శిపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నందుకు సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. ఇద్దరు ఆడిటర్లు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచడానికి సమయం కావాలని సీఐడీ కోరినందున, విచారణ ను హై కోర్టు రేపటికి వాయిదా వేసింది.
పోలీసులు బానిసలుగా పనిచేయొద్దు.. రౌండ్ టేబుల్ సమావేశం చట్టానికి లోబడి జరిగిందని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్, తెలంగాణ కొల్లు సత్యనారాయణ తెలిపారు. పోలీసులు కూడా చట్టానికి లోబడి వ్యవహరించాలన్నారు. పోలీసులు బానిసలుగా పనిచేయడం సరికాదని హితవు పలికారు. చట్ట ఉల్లంఘనలు న్యాయవాదులు ప్రశ్నిస్తూనే ఉంటారని... సున్నితమైన, చట్టపరమైన అంశాలను పోలీసులు గుర్తించాలని సత్యనారాయణ పేర్కొన్నారు.
దురదృష్టకరం.. న్యాయవాదులకు ఏపీ సీఐడీ జారీ చేసిన నోటీసులను ఖండిస్తూ అధికార వైఎస్సార్సీపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది పునురు గౌతంరెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయవాదుల పోరాటానికి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇది పార్టీలకు రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటం అని స్పష్టం చేశారు. ఏపీ సీఐడీ న్యాయవాదులకు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఇది వ్యక్తులకు, పార్టీలకు సంబధించిన అంశం కాదని గౌతమ్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి :