నవ్యాంధ్రను ప్రగతిపథంలో పరుగులు పెట్టించాలన్నా, కలల రాజధాని కళ్ల ముందు పూర్తిస్థాయిలో కనిపించాలన్నా... చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ వివిధ వర్గాల మహిళలు ప్రజల్లోకి తమ వాణిని తీసుకెళ్తున్నారు. కేంద్ర సహకారం లేకపోయినా, పొరుగు రాష్ట్ర నేతలు ఇబ్బందుల పాల్జేస్తున్నా, ప్రతిపక్ష పార్టీ కుయుక్తులు పన్నుతున్నా నిబ్బరంగా నిలబడి... రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న చంద్రబాబుకు మేమంతా అండగా ఉంటామంటూ నారీమణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు మరోసారి సీఎం కావాలని దుర్గమ్మ సన్నిధి వరకూ కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.
అనుభవజ్ఞుడే రావాలి
నారా వారి కోసం నారీలోకం పేరిట విజయవాడలో మహిళల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కుల, మత, వర్గాలకు అతీతంగా పెద్దసంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబే మళ్లీ అధికారంలోకి రావాలని ముక్తకంఠంతో వారంతా నినదించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి... తెలుగుదేశం గెలుపునకు కృషి చేస్తామని అంటున్నారు. మహిళల ఆత్మీయ సమావేశంలో పాప్ గాయని స్మిత పాల్గొన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ వివేచనతో ఆలోచించి... రాష్ట్రానికి మంచి చేకూర్చే చంద్రబాబును ఎన్నుకోవాలన్నారు.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సుకు... నారా భువనేశ్వరి, ఆమె సోదరి లోకేశ్వరి కూడా హాజరయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో రావడం అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చిందని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.
అండగా ఉండండి
రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటూ తనను మరోసారి గెలిపించేందుకు తరలివచ్చిన నారీలోకం కోసం చంద్రబాబు ఒక దృశ్యరూప సందేశాన్ని పంపించారు. ప్రపంచంలో కోటి మంది అక్కాచెల్లెళ్లు ఉన్న సోదరుడు తాను ఒక్కడ్నేనన్న చంద్రబాబు... ప్రతి మహిళ, ఆమె చుట్టుపక్కల వాళ్లు సైతం సైకిల్ గుర్తుకు ఓటేసేలా ప్రచారం చేయాలని కోరారు.
మళ్లీ చంద్రబాబే రావాలి అనే నినాదాన్ని ప్రతి ఒక్కరి గుండెల్లోకి తీసుకెళ్లేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామంటున్నారు ఈ నారీమణులు.