Lack of Irrigation Water in the Eastern and Western Krishna Deltas : పక్షం రోజులు నీరొస్తే.. పైరు గింజ పట్టేది. నెల రోజుల నుంచి నీరు పారక తడి ఆరిపోయి.. నేల నెర్రెలు బారితే.. వరి దుబ్బు మాత్రం ఏమి చేయగలదు. జీవం లేని బిడ్డ చందమే! ఒక్క తడి.. ఒక్క తడి అంటూ అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి నెత్తీనోరు బాదుకున్నా ప్రయోజనం లేదు. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాల్లో ఏ కాల్వ కట్టపై చూసినా వందలకొద్దీ డీజిల్ ఇంజిన్లు, వేలాది అడుగుల మేర వేసిన పైపులు, ప్లాస్టిక్ ట్యూబులే కనిపిస్తున్నాయి. కాల్వలోకి నీరు రావడమే ఆలస్యం.. వెంటనే తోడి పోస్తున్నారు. ఒక్కో తడికి 6 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అయినా పంట చేతికి వస్తుందనే నమ్మకం లేదు.
Paddy Crops Drying Up Due to No Water : తూర్పు, పశ్చిమ డెల్టా ఆయకట్టులోని చివరి భూముల్లో ఇప్పటికే వేలాది ఎకరాల వరి ఎండిపోతోంది. ఎక్కడ చూసినా నెర్రెలిచ్చిన నేలలే! కొన్నిచోట్ల నారుమళ్లు పోసినా.. నీరందక నాట్లు వేయకుండా వదిలేశారు. రైతులు సగటున కౌలు 20 వేల రూపాయలు, పెట్టుబడి 25 వేలు, నీటి తడులకు 24 వేలు కలిపితే.. ఎకరాకు సుమారు 70 వేల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అయినా పంట తాలుగా మారుతోంది. రైతులు ఇంతగా అలమటిస్తున్నా.. వ్యవసాయశాఖ, నీటిపారుదల శాఖ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు పొలం గట్టు తొక్కిన పాపాన పోలేదు.
Farmers Suffering Due to Lack of Irrigation Water : కృష్ణా డెల్టా కింద ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ కాలువ, బందరు డైరెక్టు కాలువ, రైవస్ కాలువల ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. ఒకప్పుడు డెల్టాలో మూడు పంటలను రైతులు సాగు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక పంట పండటం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం వర్షాభావం నెలకొనడంతో పంటలు ఎండుతున్నాయి. అవి ఏమీ వర్షాధారంపై వేసిన పంటలు కావు. సాగునీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ ఉన్న డెల్టా భూములు.
Krishna Delta Farmers Facing Problems With Irrigation Water : జిల్లాలో మూడు కాలువల కింద 6లక్షల ఎకరాలు సాగులో ఉంది. రోజుకు 18వేల క్యూసెక్కుల నీరు అందించాల్సిన బ్యారేజీ ప్రస్తుతం 4 వేల 650 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇస్తోంది. కాల్వల కింద 6 లక్షల ఎకరాలు సాగులో ఉండగా.. సుమారు లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పంట చేతికందే పరిస్థితి లేదు. కాల్వల్లో నీటిని ఎత్తిపోసేందుకు ఎకరాకు డీజిల్ ఇంజినుకు 2 వేల రూపాయలు తీసుకుంటున్నారు.
పంట పోలాలకు అందని నీరు : ఏలూరు జిల్లా కైకలూరు, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి మండలాల పరిధిలోని దాదాపు 40వేల ఎకరాల ఆయకట్టు కృష్ణాడెల్టా పరిధిలో ఉంది. ఇక్కడి కాలువలకు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం వంతుల విధానంలో 200 క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేయడం లేదు. దీంతో శివారు ప్రాంతాల్లో పొలాలకు నీరు అందటం లేదు.
నీటి ఎద్దడి.. లబోదిబోమంటున్న రైతన్నలు : భూమి నెర్రెలు బారటంతో పంట ఎందుకూ పనికిరాకుండా పోతోంది. నెల నుంచి నీటి ఎద్దడి ఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పొట్ట దశలో ఉన్న వరి అవసరమైన నీరు అందక మాడిపోతోంది. ఇప్పటికే రెండు సార్లు నాట్లు వేసి అధిక వర్షాలతో నష్టపోగా...ఇప్పుడు కాలువల నుంచి నీరు అందక పైరు ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు. పట్టిసీమ నీరిస్తే సమస్య ఉండేది కాదని, మొదటి పంటకు ఇంత నీటి ఎద్దడి రావటం ఇదే మొదటిసారని అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
Farmers Suffering Due to Lack of Irrigation Water: వరిపైరుకు అందని సాగునీరు.. అల్లాడుతున్న రైతులు
ఆయకట్టు చివరి భూములకు అందని సాగునీరు : పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 4.61 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. చాలా చోట్ల వరిదుబ్బు పచ్చగా కనిపిస్తున్నా ఎదుగుదల లేదు. డెల్టాలో ప్రధానమైన హైలెవల్ ఛానల్ సామర్థ్యం 377 క్యూసెక్కులు కాగా 186 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్‌కు 2 వేల 279 క్యూసెక్కులకు వెయ్యీ 51, కొమ్మమూరు కాల్వకు 3వేల 767 కాగా 12 వందల 93 క్యూసెక్కులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదు.
ఎకరాకు బస్తా దిగుబడి కూడా వచ్చేలా లేదు : బాపట్ల మండలంలో పడమర బాపట్ల బ్రాంచి కెనాల్ పరిధిలోని రెండున్నర వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. డీజిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడి పంటను కాపాడుకుందామన్నా కాల్వల్లో ప్రవాహం లేక.. పంటపై ఆశలు వదిలేసుకున్నారు. ఎకరాకు బస్తా దిగుబడి కూడా వచ్చేలా లేదు. బాపట్ల ఛానల్‌లో డీజిల్ ఇంజిన్ల ద్వారా ఎగువ ప్రాంత ఆయకట్టుదారులు నీటిని తోడేస్తుండటంతో దిగువ భూములకు నీరు అందటం లేదు. పశ్చిమ ప్రధాన కాల్వకు గతేడాది ఇదే సమయానికి 39 టీఎంసీలు సరఫరా చేయగా.. ఈ ఏడాది 32 టీఎంసీలే అందాయి. వర్షాలు లేక సాగునీరూ అందక రైతులు దిగులు చెందుతున్నారు.
రైతుపై మోయలేని ఆర్థిక భారం : కృష్ణా పశ్చిమ డెల్టా సాగునీటి కాల్వల్లో నీరు రాక.. గత్యంతరం లేక పక్కనున్న మురుగుకాల్వల్లో వచ్చే నీటిని రైతులు ఇంజిన్లతో తోడి పొలాల్లోకి పంపిస్తున్నారు. ఎకరాకు తడి ఇవ్వాలంటే 6 వేల వరకు వెచ్చిస్తున్నారు. బ్యాంక్ కెనాల్, హైలెవల్ కెనాల్, కొమ్మమూరు కాల్వల కింద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
రైతు కళ్లలో కనపడని సంతోషం : గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం ఛానెల్ కింద కొండపాటూరులో 1,200 ఎకరాల్లో వరి సాగు చేయగా.. నీరందక కొమ్మమూరు కాల్వ వద్ద జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. మూడు జనరేటర్లు, రెండు ఆయిల్ ఇంజిన్లు, ట్రాక్టరు ఇంజిన్లతో నీటిని తోడి పోసుకుంటున్నారు. వాటి అద్దె నెలకు 2 లక్షల రూపాయల పైమాటే. రోజుకు 60 వేల వరకు డీజిల్ ఖర్చు అవుతోంది. ఇంత చేసినా ఫలితం దక్కుతుందనే అశ రైతుల్లో కనబడటం లేదు.
Situation Of Krishna West Delta Canals: అధ్వానంగా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు..నీరు పారేదెలా?