కరోనా ప్రభావంతో కృష్ణా జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. లాక్డౌన్ ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం కోరుతుంది. ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లలో ఉదయం 7 గంటలకే కూరగాయలు అయిపోతున్నాయి. ఇదే అదునుగా దళారులు కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కష్టకాలంలో ప్రజలకు బాసటగా నిలిచేందుకు ముందుకువచ్చారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లికి చెందిన తోట వెంకయ్య. సుమారు 50 వేల రూపాయలతో కూరగాయలు కొనుగోలు చేసి గ్రామాల్లో ఉచితంగా పంపణీ చేశారు. రెండు రోజుల నుంచి కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది.
చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ నెల 31 వరకు కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తానని తోట వెంకయ్య తెలిపారు. దాతలు మరికొంత మంది ముందుకొస్తే ప్రజల ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : ఆపద సమయంలో ఆకలి తీరుస్తున్న జైన యువత