బోర్ల కింద వరి పంట వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై కృష్ణా జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులు దాళ్వా సాగులో అపరాలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని.. జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రకటన చేశారు. తగినంత నీటి లభ్యత లేనందున... మొక్కజొన్న, మినుము, పిల్లి పెసర, జొన్న, నువ్వుల, వేరుశనగ, జనుము వంటి ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవడం మంచిదని సూచించారు.
అయితే.. తాము ఇప్పటికే సాగు మొదలు పెట్టామని, ఇప్పుడు వరి పంట వేయొద్దంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. బోర్ల కింద వరి పంట వేయొద్దని ప్రకటించడమే కాకుండా.. రైతు భరోసా కేంద్రాల నుంచి ఒత్తిడి తెస్తుండడాన్ని అన్నదాతలు తప్పుపడుతున్నారు. ఒకవేళ రైతులు పండించినా కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని చెబుతుండడంపైనా ఆందోళన చెందుతున్నారు. వరి వేయకపోతే తిండిగింజలు ఎలాగని ప్రశ్నిస్తున్నారు.
ఈనెల మూడో వారం వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదల చేశారని, ఇప్పుడు ఒక్కసారిగా నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరగాయని, పెట్టుబడి ఖర్చు ఎక్కువైందని ఆందోళన చెందుతున్న తమకు.. సర్కారు ఉన్నట్టుండి వరి పండించొద్దని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోవట్లేదని అంటున్నారు.
ఇదీ చదవండి: family member certificate: తహసీల్దారు కార్యాలయం ఎదుట.. మహిళ నిరాహార దీక్ష