కూలీల కొరత తీవ్రమవుతుండటం, నీటి వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో రైతులు వరిలో వెద పద్ధతికి మళ్లాలని ఈ సందర్భంగా ప్రసాదరావు వివరించారు. రైతులు వ్యవసాయంపైనే ఆధారపడకుండా.. అనుబంధంగా పశుపోషణ, మేకలు, కోళ్ల పెంపకంపైనా దృష్టి సారించాలని సూచించారు. రెండెకరాల పొలం, రెండు గేదెలతో వ్యవసాయం ఆరంభించిన ఆయనకు ఇప్పుడు ఎనిమిదెకరాల సొంత భూమి ఉంది. 250 పశువుల్ని పెంచుతున్నారు. 50 పైగా బ్లాక్ బెంగాల్ మేకలు, 100 పైగా నాటుకోళ్లు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించారు. వెద పద్ధతిలో సాగు, దిగుబడి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
రోజూ 600 లీటర్ల పాలు
అతివృష్టి, అనావృష్టి, కూలీల కొరత, గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితుల్లో పశువులు, మేకల్ని కూడా పెంచుకోవడం లాభదాయకం. ఒక మేక నుంచి ఏడాదికి 30 వేల ఆదాయం సాధించవచ్చు. రెండు గేదెలతో పాడి ప్రారంభించా. దొడ్లో పుట్టిన దూడలతో మంద పెంచాను. రోజుకు 600 లీటర్ల పాలను పోస్తుంటాం.
అప్పు దొరకని పరిస్థితుల్లో..
నాలుగెకరాల పొలం ఉన్న నాన్న సుబ్బయ్య.. ఉచితంగా పశువైద్యం అందించేవారు. దీంతోపాటు పిల్లల పెళ్లిళ్లు, ఇతర ఖర్చులకు రెండెకరాలు అమ్మాల్సి వచ్చింది. పదోతరగతి చదువుతున్న నాకు రూ.1000 అప్పు కోసం ప్రయత్నించినా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నాన్నకు నచ్చజెప్పి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నా. సాగులో ఎన్నో కష్టాలు ఎదురైనా ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు.
కేసీఆర్ ప్రశంస...
ఉప్పల ప్రసాదరావుకి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫోన్ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. వరి సాగుల్లో సీడ్ డ్రిల్ ద్వారా తాను అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నాడని తెలిపారు. వరిలో వెద విధానం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడని ప్రసాదరావు అన్నారు. అందుకు ఉపయోగించే యంత్రాల లభ్యత, వాటి పనితనం గురించి సీఎం కేసీఆర్‌కు తెలిపానని అన్నారు. తనను తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తమ ఆథిత్యం స్వీకరించాలని కేసీఆర్ కోరారని ఆనందం వ్యక్తం చేశారు.
వెద పద్ధతిలో వరి లాభదాయకం
వెద పద్ధతిపై 22 ఏళ్ల కిందటే ప్రయత్నించా. అప్పట్లోనే రూ.18 వేలతో సీడ్ డ్రిల్లర్ తయారు చేయించి.. ఏటా అదే పద్ధతిలో వరి వేస్తున్నా. ఈ ఏడాది కూడా 35 ఎకరాల వరకు వెద పద్ధతిలో సాగు చేశాను. అధిక వర్షాల వల్ల ఎక్కువ విస్తీర్ణంలో వేయలేకపోయాను. మొత్తంగా 70 ఎకరాల్లో పచ్చిరొట్ట ఎరువులు, పశు వ్యర్థాలతో సేంద్రియ వ్యవసాయం, 100 ఎకరాల్లో సాధారణ వ్యవసాయ పధ్ధతులను అనుసరిస్తూ.. పలు నూతన వంగడాలను పండిస్తున్నాను.
* వెద పద్ధతిలో పొడి వాతావరణంలో, పొడి దుక్కిలో యంత్రం ద్వారా విత్తనాలు వేస్తాం. వానలు కురవగానే మొలకెత్తుతాయి. దమ్ము విధానంలో ఎకరాకు 30 కిలోల విత్తనం అవసరమైతే.. వెద విధానంలో 10-12 కిలోలు సరిపోతాయి. నారు పోయడం, దమ్ము తిప్పించడం, నారు పీకడం, నాటు వేయడం తదితర ఖర్చుల రూపంలో సగటున ఎకరాకు రూ.5వేలకు పైగా పెట్టుబడి తగ్గుతుంది.
* నీటి వినియోగం తక్కువ. వారం, పదిరోజులకు ఒకసారి ఆరుతడులు ఇస్తే చాలు.
* ఎకరాకు 40 నుంచి 45 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి.
* దమ్ము చేయించి.. డ్రమ్ సీడర్‌తో పోసినప్పుడు జడివాన కురిస్తే విత్తనాలు చెదిరిపోతాయి. మొలకలు సరిగా రావు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధానంలో వేయవచ్చు.
* వెద పద్ధతిలో వరి సాగు చేసిన పొలాల్లో రెండో పంటగా మినుము, పెసర వేస్తే వాటి దిగుబడులు రెట్టింపు అవుతున్నాయి.
ఇదీ చదవండి: