UNRECOGNISED VILLAGE IN TELANGANA: అదో ఊరు. ఉందా అంటే ఉంది. దానికి పేరుందా అంటే అదీ ఉంది. కానీ అధికారిక రికార్డుల్లోకి మాత్రం రావటం లేదు. ఏదో ఓసారి సిబ్బంది తప్పిదం జరిగి, ప్రస్తావనకు రావటం లేదంటే అదీ కాదు. అక్షరాలా 18 ఏళ్ల కిందట ఏర్పడిన ఆ పల్లె ఇప్పటికీ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో వెల్లడి కావటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పరిధిలోకి వచ్చే సుందర్‌నగర్ గ్రామస్థుల దుస్థితి ఇది.
ఊరు ఏర్పడక ముందు పద్దెనిమిదేళ్ల వెనక్కి వెళ్తే 2006లో ఇంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఏమాయికుంట గ్రామ పంచాయతీ శివారులో 90 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఆ పల్లె పేరును సుందర్‌నగర్‌గా పెట్టుకున్నా ఇప్పటికీ ఏ గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందో తేలలేదు.
ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ చెందినవారైతే స్థలమేమో ఏమాయికుంట పరిధిలో ఉంది. ఫలితంగా సుందర్‌నగర్ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో ఇప్పటికీ స్పష్టత రాలేదు. 400 జనాభా కలిగి ఉన్నా కనీస వసతులకు నోచుకోవటం లేదు. ప్రజల దయనీయ పరిస్థితి చూసి గతంలో ఓ కలెక్టర్ గ్రామానికి పంచాయతీ ప్రస్తావన లేకుండానే విద్యుత్ సౌకర్యం కల్పించగా, ఉట్నూర్ ఐటీడీఏ రెండు బోర్లు వేయించింది. అక్కడ ఓ అంగన్‌వాడీ భవనం తప్పితే ఊర్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు లేవు. నిరుపేదలకు పక్కా ఇళ్ల ఊసే లేదు. చివరికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది. పంచాయతీ గుర్తింపు అనేది ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాల్సిన ప్రక్రియ అనే మాట అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది.
"ప్రభుత్వం 2006వ సంవత్సరంలో భూమి కొనుగోలు పథకం కింద 4 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసి మాకు ఇచ్చింది. అప్పట్లో 90 కుటుంబాలకు ఇచ్చారు. అప్పటి నుంచి ఇటు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి రావడం లేదు, ఇటు ఏమాయికుంట గ్రామ పరిధిలోకి రావడం లేదు. ఎక్కడకు వెళ్లినా ఇబ్బందిగా మారుతుంది. డెత్ సర్టిఫికేట్ క్లైమ్ చేసుకోవాలనుకున్నా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. తమ గ్రామాన్ని ఏదో ఒక పంచాయతీలో విలీనం చేయకపోతే, ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ చేయాలని కోరుతున్నాము. ప్రస్తుతం 600 మంది జనాభా, 400 మంది ఓటర్లు ఉన్నారు." - స్థానికులు
"రెవెన్యూ రికార్డుల ప్రకారం సుందర్‌నగర్ ఊరు ఏమాయికుంట పరిధిలో ఉంది. ఆధార్ కార్డు వంటి ధ్రువపత్రాల్లో మాత్రం ఇంద్రవెల్లిలో ఉన్నారు. వీళ్ల ఆధార్ కార్డు అప్డేట్ అవ్వాలి. ఇంటి నెంబరు సైతం ఉండాలి. వీళ్లకు ల్యాండ్ ఇచ్చిన ఎవిడెన్స్ ఉంటే ఏమాయికుంటలో ఆధార్ కార్డును తీసుకుంటారు. అయితే ఓటరుగా మాత్రం ఎక్కడి నుంచైనా ఉండవచ్చు. పంచాయతీ గుర్తింపు అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాల్సిన ప్రక్రియ." - భాస్కర్, ఎంపీడీవో , ఇంద్రవెల్లి
కనుమరుగవుతున్న ఆ గ్రామం.. - Old Edlanka Submerged to Krishna
గాలి వానలో, వాగు నీటిలో పడవ ప్రయాణం- రహదారి తెలియదు పాపం! - Pudilanka peoples problem