కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Kondapalli Municipal Chairman election) రేపటికి వాయిదా పడింది. సభలో వైకాపా అభ్యర్థులు గొడవ చేయటంతో.. డిప్యూటీ కలెక్టర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అయితే.. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాయిదా వేశారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అనంతరం కౌన్సిల్ హాల్ నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయటకు వెళ్లిపోయారు. ఎన్నిక వాయిదా వేయడం న్యాయ నిబంధనల ఉల్లంఘనే అని తెదేపా విమర్శించింది.
కోరం ఉన్నా.. ఎన్నిక జరపకుండా వాయిదా వేశారని తెదేపా సభ్యులు కౌన్సిల్ లోనే బైఠాయించారు. కోరం ఉంది కాబట్టి ఎన్నిక జరపాలని ఎంపీ కేశినేని నాని ఆర్ఓ ను కోరారు. ఎన్నిక వాయిదా వేస్తే.. లిఖితపూర్వకంగా రాసివ్వాలని వైకాపా కౌన్సిలర్లు కోరారు.
కాగా.. అంతకు ముందు కౌన్సిల్ కార్యాలయం వరకూ పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు చొచ్చుకొచ్చి.. తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ అధికార పార్టీ వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. పోలీసులకు, వైకాపా శ్రేణులకు మధ్య తీవ్రతోపులాట చోటుచేసుకుంది. కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు తెలుగుదేశం శ్రేణులను అరకిలోమీటరు దూరంలోనే నిలిపేసిన పోలీసులు.. వైకాపా శ్రేణులను మాత్రం వంద అడుగుల దూరం వరకూ అనుమతించారు.
వైకాపా శ్రేణులు తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా.. వారిని పంపివేయకుండా పోలీసులు చోద్యం చూశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమైన వెంటనే.. కౌన్సిల్ హాల్ లో ఎంపీ ఓటు హక్కును వ్యతిరేకిస్తూ వైకాపా అభ్యర్థులు నినాదాలు చేశారు. బల్లలు చరుస్తున్న శబ్దాలు చేస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. మీడియాను లోనికి అనుమతించలేదు. తెదేపా మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా చెన్నబోయిన చిట్టి బాబుని తెదేపా అధిష్టానం ప్రకటించింది.
ఇదీ చదవండి: Kondapalli Municipal Chairman Election: నేడు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక