ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ నగరం అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోయిందని ఎంపీ కేశనేని నాని విమర్శించారు. సీఎం జగన్ విజయవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన రూ.460 కోట్ల స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ పనులపై సంబంధిత అధికారులతో కేశినేని భవన్లో సమీక్ష నిర్వహించారు.
ఎంపీ మాట్లాడుతూ.. వైకాపా మంత్రులు అపార్ట్మెంట్ల వ్యాపారం మాని విజయవాడ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. వైకాపా నాయకులకు కమీషన్లు ఇచ్చేవారికే నిధులు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్నపాటి వర్షానికే నగరం మునిగిపోతోందని.. అందుకే స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామన్నారు. వాటి పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు రూ.80కోట్ల దాకా చెల్లించాలని.. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక అందుబాటులో లేక కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడంలేదన్నారు. ఇప్పటికైనా విజయవాడ అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు.
'వైకాపా ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. తెదేపా హయాంలో నగర అభివృద్ధికి చంద్రబాబునాయుడు కృషి చేశారు. అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారు. అయితే జగన్ సీఎం అయినప్పటినుంచి ఎక్కడివక్కడే అన్నట్లు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులను మంజూరుచేయడంలేదు. స్ట్రోమ్ వాటర్ ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులు విడుదల చేసి వెంటనే డ్రైనేజీ పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం'-- కేశినేని నాని, ఎంపీ
ఇవీ చదవండి...
తన తండ్రి మొదలుపెట్టిన పావలా వడ్డీ పథకాన్నే జగన్ ఆపేస్తారా?..: సోమిరెడ్డి