తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ కన్నా నగర అభివృధ్ధి ముఖ్యమని భావించాం. అందుకే ఈ స్థానాన్ని భాజపాకు వదిలేశాం. ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతో పాటు నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడటానికే అని జనసైనికులు గమనించాలి.
- పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ కన్నా నగర అభివృధ్ధి ముఖ్యమని భావించామని, అందుకే ఈ స్థానాన్ని భాజపాకు వదిలేశామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలోని అరాచక శక్తుల పీచమణచడానికి భాజపా సమాయత్తమవుతోందన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ తరహాలోనే తిరుపతిలోనూ పోరాడుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పవన్‌కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వైకాపా ఆగడాలకు దీటుగా సమాధానం చెబుతామన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఆగడాలను చూస్తూనే ఉన్నామని, వారిని ఎదుర్కోవడానికే భాజపాతో కలిసి సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
తాము ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతో పాటు నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడటానికే అని జనసైనికులు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి నిర్ణయం వెనుక దూరదృష్టి ఉందని జనసేన శ్రేణులు గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రగతికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌లతో తిరుపతి ఉపఎన్నికపై లోతుగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు.
తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా వివిధ రంగాల్లో అభివృద్ధి చేస్తామని వారు చెప్పారన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన అభ్యర్థి ఉంటే తిరుపతి స్థానాన్ని వారికే వదిలిపెడతామని ముందు నుంచి చెబుతూ వస్తున్నామని పవన్‌కల్యాణ్ వివరించారు. భాజపా ప్రతిపాదించిన అభ్యర్థికి విజయం సాధించగల సత్తా ఉందని భావించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఈ లోక్‌సభ స్థానాన్ని 1999లో భాజపా కైవసం చేసుకున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు భాజపా తగు చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని పవన్ చెప్పారు.
ఉమ్మడి నిర్ణయమే
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాజపా, జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా భాజపా నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన భాజపా, జనసేన నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఉమ్మడిగా భాజపా నుంచి అభ్యర్థిని పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధరన్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: