Maharashtra Polls MVA Manifesto : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మహా వికాస్ అఘాడీ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. మహాలక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు స్టైఫండ్ కింద రూ.4 వేలు అందజేస్తామని పేర్కొంది. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని వెల్లడించింది.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చింది. ముంబయిలోని ట్రైడెంట్ హోటల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను 'మహారాష్ట్ర నామా' పేరిట రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు పాల్గొన్నారు.
#WATCH | Mumbai, Maharashtra: During the launch of the joint manifesto of the MVA for the Maharashtra Assembly Elections, Congress President Mallikarjun Kharge says, " ... what does he mean by this? 'aap kisko kaatangey?'... indira gandhi and rajiv gandhi sacrificed their lives to… pic.twitter.com/pLJaKx2z3k
— ANI (@ANI) November 10, 2024
"వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తాం. సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులకు రూ. 50 వేల సహాయం అందిస్తాం. మహారాష్ట్రలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తాం. పర్యావరణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి, ప్రజా సంక్షేమంతో కూడిన ఐదు హామీలతో కూడిన మేనిఫెస్టోను మీ ముందుంచాం. ఈ ఐదు గ్యారెంటీలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దాదాపు రూ. 3 లక్షల వార్షిక సాయం అందుతుంది. రూ. 25 లక్షల ఆరోగ్య బీమాను ప్రజలను అందిస్తాం."
--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
'దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు'
దేశం దృష్టి ముంబయిపై ఉందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ముంబయి సమగ్ర అభివృద్ధి నగరమని కొనియాడారు. ఆర్థిక, పారిశ్రామిక, పెట్టుబడి విషయాల్లో మహారాష్ట్ర ముందుందని ప్రశంసించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలని పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమికి అధికారం ఇస్తే రాష్ట్రంలో మెరుగైన పాలనను అందిస్తామని వెల్లడించారు. రైతులకు, యువతకు ఈ ఎన్నికలు ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి, అధ్యయనం చేసి ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఎప్పుడూ అబద్ధాలు చెబుతారని, బీజేపీ పార్టీల చిహ్నాలను దోచుకుందని ఆరోపించారు.
#WATCH | Mumbai, Maharashtra: During the launch of the joint manifesto of the MVA for the Maharashtra Assembly Elections, Congress President Mallikarjun Kharge says, " he (pm narendra modi) said this red book is an urban naxalite book and piece of marxist literature... he gifted… pic.twitter.com/ntL938Y646
— ANI (@ANI) November 10, 2024
ఒకే దశలో పోలింగ్
మహారాష్ట్రలో 288స్థానాలకు ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో మహాయుతి కూటమి ప్రయత్నిస్తోంది. మహాయుతిని గద్దెదించి, అధికారాన్ని దక్కించుకోవాలని ఎంవీఏ కూటమి పోరాడుతోంది.