తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు రాజధాని విషయంలో వైకాపా నడుచుకుంటున్న విధానంపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతే రాజధాని అనే నిర్ణయాన్ని ప్రజలు, రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయని ఆయన గుర్తుచేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూడు ముక్కల నిర్ణయంతో రాజధాని రైతుల గుండెలపై కుంపటి పెట్టారని కళా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆక్రమించుకున్న వేల ఎకరాల కోసమే విశాఖ మంత్రమని..పెట్టుబడుల్ని తరిమేస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ పచ్చిమోసానికి దిగారని ఆరోపించారు. మూడు ముక్కలాటను అన్ని పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్న కళా.. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. సెలెక్ట్ కమిటీ వద్దకు వెళ్లిన బిల్లుల్ని ఆమోదించాలని గవర్నర్ ను ఎలా అడుగుతారన్నారు. జగన్, విజయసాయిరెడ్డి భూ దోపిడీ కోసం విశాఖను బలి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పూర్తైతే రాష్ట్రానికి సరిపడా సంపద సమకూరుతుందని తెలియదా అని ప్రశ్నించారు.
తెదేపా హయాంలో ప్రతి జిల్లాకు పెట్టుబడులు తెచ్చామన్న కళా.. ఈ ఏడాదిలో వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో మంత్రి బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన పెట్టుబడుల్ని, పరిశ్రమలను తరిమేయటమే అభివృద్ధి వికేంద్రీకరణా అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ప్రజల్ని దోచుకోవటం కాదని బొత్స తెలుసుకోవాలన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా విజ్ఞతగా మెలగటం బొత్స నేర్చుకోవాలని తెలిపారు.