ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పిన వైకాపా నేతలు... పంచ భూతాలను పంచుకు తింటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. దళితులపై వైకాపా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. చివరికి ఇసుక, మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తే... నేడు ఇసుక కావాలంటే వైకాపా నేతలకు ప్రజలు కమిషన్లు ఇవ్వాల్సి వస్తోందని మండిపడ్డారు. రీచ్‌లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని వైకాపా ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే.. ఇసుక దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు.
వైకాపా పాలనలో ఇసుక కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారిందని కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు ధర పలికేదని... నేడు లారీ ఇసుక 60 వేల నుండి 70 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు. పేదలు ఇసుక కొనలేక ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేసి మొండి గోడల్లో తలదాచువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసి సామాన్యులకు పూర్తిగా అందుబాటులోకి రావడానికి ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. లేదంటే ఇసుక తుఫానులో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరోనా రికార్డ్: కొత్తగా 8,909 కేసులు, 217 మరణాలు