రాష్ట్రంలో వైకాపా దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. కృష్ణాజిల్లా కొండపల్లి రిజర్వు ఫారెస్టులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు చేస్తున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా బృందంపై వైకాపా శ్రేణులు దాడి చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు కళా తెలిపారు. వైకాపా అవినీతిని అడ్డుకుని ప్రశ్నించిన వారిపై దాడులు చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అంటూ నిలదీశారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొండపల్లి బొమ్మలకు అవసరమైన కలప కొండపల్లి అడవి నుంచే వెళ్తోందని.. వైకాపా నేతల అక్రమాలతో కలప లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. దాడులు, అక్రమ అరెస్టులతో అవినీతి, దోపిడీని దాచలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని దుయ్యబట్టారు. పర్యావరణ, అటవీ చట్టాలు ఉల్లంఘించి వైకాపా నేతలు చేస్తున్న మైనింగ్‌ను ప్రశ్నిస్తే ఇటువంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. అడవులను ధ్వంసం చేసి ఎటువంటి అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడే రాక్షస సంస్కృతిని తీసుకొచ్చిన వైకాపా భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి..