Cricketr Meghana Sabbineni: మాది విజయవాడలోని ఇబ్రహీంపట్నం. నాన్న శ్రీనివాసరావు టీఎస్ జెన్‌కోలో రీజనల్ ఇంజినీర్. అమ్మ మాధవి. నాకు చిన్నప్పట్నుంచీ ఆటలంటే ఆసక్తి. నాన్నకి క్రికెట్ అన్నా, సచిన్ అన్నా అభిమానం. ఆయన్ని చూసే నాకూ ఆసక్తి పెరిగింది. ఏడో తరగతి నుంచి సాధన ప్రారంభించా. ఏడాదికే రాష్ట్ర స్థాయిలో ఆడటం మొదలుపెట్టా. అయిదారు నెలలు బయటే ఉండాల్సి వచ్చేది. దీంతో స్కూలుకి సరిగా హాజరవ్వలేకపోయే దాన్ని. చివరి పరీక్షలు మాత్రం రాసే దాన్ని. నాకో సోదరి. నాన్న, తను చదువులో సాయం చేసేవారు. నాతో పాటు ప్రయాణించి మరీ పాఠాలు చెప్పేవారు. అలానే బీఎస్‌సీ మేథ్స్ చేశా. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు మారిపోయా.
Sabbineni Meghana selected for the Indian women's cricket: చిన్నప్పటి నుంచీ క్రికెట్టే లోకం. కాబట్టి, ఎప్పుడూ దేన్నీ కోల్పోయానన్న బాధ లేదు. నాలుగేళ్ల నుంచి రైల్వేస్‌కు ఆడుతున్నా. 2016లోనే దేశానికి ప్రాతినిధ్యం వహించా. అప్పటికి నాకు 19. ఏషియా కప్ ఛాంపియన్స్ టీమ్‌లో ఉన్నా. అప్పుడు ఆడింది రెండు మ్యాచ్‌లే అయినా ఎంతో నేర్చుకున్నా. సీనియర్స్ ఆలోచనలు, సాధన, నిబద్ధత దగ్గరుండి చూశాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత నా ఆలోచన తీరులో, ఆటలోనూ పరిణతి పెరిగింది. రెండేళ్లుగా బాగా ఆడుతున్నా. అదే ప్రపంచ కప్ జట్టులో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మార్చిలో న్యూజిలాండ్‌లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడనున్నా. ఆపై వరల్డ్‌కప్. రోజూ కనీసం 5 గంటలు సాధన చేస్తా. నేనిలా ఉన్నానంటే గురువులే కారణం. నా మొదటి కోచ్ నుంచి రైల్వే కోచ్ వరకు ప్రతి దశలోనూ వాళ్లు నన్ను మలుస్తూ వచ్చారు. మిథాలీరాజ్ కూడా సలహాలు, సూచనలు ఇచ్చేది. మొదటిసారి దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు మ్యాచ్ మా ఊళ్లోనే జరిగింది. అప్పుడు మా స్కూలుకి సెలవిచ్చి టీచర్లు విద్యార్థులతో సహా స్టేడియానికి వచ్చి ప్రోత్సహించారు. అది మర్చిపోలేను. ఇప్పుడు జట్టులో ఉన్న దాదాపుగా అందరితో ఆడా. కాబట్టి, కొత్తేమీ లేదు. రెండేళ్ల నుంచీ కొనసాగుతున్న ఫామ్‌తో బాగా ఆడగలనన్న నమ్మకముంది. ఎంపిక విషయం తెలిశాక ఇంట్లో వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్లు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.
మొదట్లో సాధనకి విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. అమ్మ ఉదయం 4గం.కి లేచి మరీ తీసుకెళ్లేది. అమ్మాయికి ఇవన్నీ ఎందుకు అని తోటి ఉద్యోగులు అన్నా నాన్న నాపై నమ్మకం ఉంచారు. ఆ విమర్శలు నా దాకా రానిచ్చేవారు కాదు. నేనూ వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని నిరూపించుకోవాలి అనుకుంటా. అలాగని ఒత్తిడిగా భావించను. చేసే పనిని ఆస్వాదించడంపైనే నా దృష్టి.
ఇదీ చదవండి:
Mukkoti Ekadasi Celebrations: రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు