పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృత్తివెన్ను మండలంలోని నీలిపూడి సహా పలు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడారు. 17న జరగనున్న ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్లు వేస్తే వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందకుండా అడ్డుకుంటామన్నారు. సామాజిక పింఛన్లు, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలను రద్దు చేస్తామన్నారు.
ఈ వీడియో గురువారం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇతర పార్టీల నాయకులు కొంతమంది ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ వీడియో సందేశాలు విడుదల చేశారు. గురువారం గూడూరులో నిర్వహించిన సభలో రమేశ్ మాట్లాడుతూ... కొంతమంది తనను ఇరుకున పెట్టాలని, పార్టీ మీద బురద చల్లాలని సామాజిక మాధ్యమాల్లో తన వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్నారన్నారు. ఆ వ్యాఖ్యల్లో కొన్ని తనవేనని, కానీ కొన్నింటిని తొలగించి మరికొన్నింటిని చేర్చి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
17 వరకు మీడియాతో మాట్లాడొద్దు: ఎస్‌ఈసీ
జోగి రమేశ్ ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడకూడదని, బహిరంగ సమావేశాలు, గ్రూపులను ఉద్దేశించి ప్రసంగించకూడదని ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 211(2) కింద ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రమేశ్ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీకి మూడు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయి. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ఫుటేజీ పరిశీలించి, ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం వాస్తవమని నిర్ధరించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు జోగి రమేశ్‌పై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేకు తక్షణమే నోటీసులు అందించడంతో పాటు ఆంక్షలు అమలయ్యేలా చూడాలని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఎస్‌ఈసీ ఆదేశించారు.
ఎస్‌ఈసీ చర్యలు సంతృప్తికరంగా లేవు: వర్ల రామయ్య
ఎమ్మెల్యే రమేష్‌పై ఎస్‌ఈసీ చర్యలు సంతృప్తికరంగా లేవని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఓటర్లను భయపెట్టేలా రమేష్ నేరానికి పాల్పడితే కంటితుడుపు చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: విమాన ప్రయాణం మరింత భారం