ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమానికి మధ్య సమతుల్యత కొరవడిందని జనసేన పార్టీ అభిప్రాయపడింది. సంక్షేమ పథకాల కేటాయింపులతో పాటు.. రాష్ట్ర ఆర్థిక ప్రగతి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేస్తే బాగుండేదని సూచించింది. నవరత్నాల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినా....అందుకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయో స్పష్టత కొరవడిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు రూ. 5 వేల కోట్లు కేటాయించారని.... ప్రభుత్వం చెప్పిన విధంగా 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మరో రూ. 32 వేల కోట్లు అవసరం ఉందని... ఆ నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారనేదానిపై ఎలాంటి సమాచారమివ్వలేదని పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరిస్తే బాగుంటుందని సూచించాయి. రాష్ట్ర అభివృద్ది కోసం పాటుపడిన మహనీయుల పేర్లను కొన్ని పథకాలకైనా పెట్టాలని విజ్ఞప్తి చేశాయి. మొత్తంగా బడ్జెట్ పరిశీలిస్తే .. ఆదాయం, వ్యయాల మధ్య భారీగా తేడా కనబడుతోందని.... రాష్ట్రానికి ఉన్న రాబడి ఎంత, కేంద్రం నుంచి ఎంత వస్తుంది, అప్పుల రూపంలో ఎంత తీసుకువస్తున్నాం.. అనే అంశాల మధ్య సమతుల్యత పాటిస్తేనే రాష్ట్రం అభివృద్ది సాధ్యపడుతుందనే అభిప్రాయాన్ని పార్టీ వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి