R&B Department Sanctioning Funds for Roads Repairs in AP: రహదారుల మరమ్మతుల కోసం చేపట్టిన పాత్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం కోసం రహదారులు, భవనాల శాఖ రూ.210 కోట్లను విడుదల చేసింది. ఈ క్రమంలో నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులపై ఉండే గోతులు పూడ్చేందుకు, మరమ్మతుల కోసం ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు రహదారులు, భవనాల శాఖ తెలిపింది. రహదారులపై గోతులు పూడ్చటంతో పాటు రహదారుల పక్కన పిచ్చిమొక్కలు కూడా తొలగించే పనులు కూడా చేపట్టాలని ఆ శాఖ ఇంజనీర్ ఇన్చీఫ్ను ఆదేశించింది.
అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా ఈ పనులు చేపట్టాల్సిందిగా ఆదేశిస్తూ ఆర్ అండ్ బీ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పాత్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం కోసం రాష్ట్ర విపత్తు నిధి నుంచి రెవెన్యూ శాఖ మరో 140 కోట్ల రూపాయల్ని విడుదల చేసింది. ఇప్పటికే ఈ నిధి కింద రహదారుల మరమ్మతుల కోసం రూ.220 కోట్ల ను రెవెన్యూ శాఖ విడుదల చేసింది. జనవరి 15వ తేదీకల్లా రాష్ట్రంలోని రహదారులపై ఉన్న గుంతలు పూడ్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశింంచింది.
CM Chandrababu Open Mission Pothole Free AP Program : అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెన్నెలపాలెంలో గుంతలు లేని రోడ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. స్వయంగా పార పట్టుకుని గుంతలను పూడ్చారు. అనంతరం రోడ్ రోలర్‌ను నడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారు : గత పాలకులే కారణంగా రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారిగా మారాయని, మాజీ సీఎం జగన్ రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జగన్‌కు మనసు రాలేదని అన్నారు. రహదారులు అభివృద్ధికి చిహ్నమని, గుంతలు లేని రోడ్లకు వెన్నలపాలెంలో శంకుస్థాపన చేశామని, రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని తెలిపారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని అధికారులను ఆదేశించారు.
బ్రాండ్ ఏపీ కోసం మంత్రి లోకేశ్ కృషి - పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్
ఈ దుస్థితికి గత పాలకుడే కారణం - రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు