రెండు జిల్లాల పరిధిలో ఆన్‌లైన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహణలో ముఖ్య పాత్రధారుడిగా ఉన్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మొగిలిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు సబ్ ఏజెంట్‌లు 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు. వీరంతా కృష్ణా, ప్రకాశం జిల్లాకు చెందిన వారని ఆయన వెల్లడించారు. నిందితుల నుంచి 6లక్షల 45వేల నగదు, 17 సెల్‌ఫోన్లు, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్రత్యేక అధికారి వకుల్ జిందాల్ నేతృత్వంలో నూజివీడు పోలీస్‌స్టేషన్ పరిధిలో దర్యాప్తు ప్రారంభించి మొత్తం 18 మంది నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ అనే వ్యక్తి బెట్టింగ్ నిమిత్తం ఒక యాప్ లింక్ రూపొందించి వెంకటేశ్వర్లుకు అందించగా దాని ఆధారంతో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంల ద్వారా బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. చాకచక్యంగా బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించిన నూజివీడు సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.