రాష్ట్రంలోని 9 జిల్లాల్లో దాదాపు 20 శాతం మందికి కరోనా వచ్చి వెళ్లిపోయింది. మలివిడతగా 9 జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ ‘సిరో సర్వైలెన్స్’ నిర్వహించగా.. సగటున 19.7% మందికి కొవిడ్‌వచ్చి తగ్గిపోయినట్లు వెల్లడించింది. వీరిలో సగటున 90% మందిలో ఎటువంటి అనుమానిత లక్షణాలు లేవని తెలిపింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 30.6%, కర్నూలు 28.1% మందికి వైరస్ సోకి తగ్గినట్లు గుర్తించామంది. ఫలితాల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కె.భాస్కర్ విజయవాడలో గురువారం విలేకర్లకు వెల్లడించారు.
తొలివిడతగా అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో 3,750 మంది చొప్పున రక్త నమూనాలు సేకరించారు. మలివిడతలో చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో ఐదువేల మంది చొప్పున రక్త నమూనాలు సేకరించినట్లు భాస్కర్ తెలిపారు. సగటున పురుషుల్లో 19.5%, మహిళల్లో 19.9% మందికి ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వెల్లడించారు. ఇలా వైరస్ సోకినవారు ఎక్కువ ఉంటే.. కేసులు తగ్గుతాయని భాస్కర్ చెప్పారు.
ఇదీ చదవండి