ఆర్థిక మాంద్యం వల్ల చతికిలపడ్డ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కరోనా, లాక్‌డౌన్ కారణంగా మరింతగా పతనావస్థకు చేరకున్నాయి. ఈ సమయంలో కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ఎంఎస్ఎంఈ లకు కొత్త ఊపిరినిచ్చిందని పారిశ్రామికవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర చర్యల వల్ల పరిశ్రమలు నిలదొక్కుకునే అవకాశం ఏర్పడిందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఎంఎస్ఎంఈలకు 3లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలన్న నిర్ణయం ఆహ్వానించదగిన పరిణామమంటున్నారు. అలాగే ఎంఎస్ఎంఈల టర్నోవర్ పరిధిని పెంచడం మంచి నిర్ణయమని చెబుతున్నారు. 200 కోట్ల రూపాయల వరకు కాంట్రాక్టులకు గ్లోబల్ టెండర్లను పిలవకూడదన్న నిర్ణయం చిన్నతరహా పరిశ్రమలకు లాభదాయకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రుణాలపై వడ్డీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందని పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు.
లాక్‌డౌన్ కారణంగా మూతపడిన పరిశ్రమలను తెరిచేందుకు త్వరగా అనుమతులివ్వాలని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. పరిశ్రమలు తెరిచే వీలే లేకుంటే... ఎన్ని ప్యాకేజీలు ప్రకటించినా లాభముండదని చెబుతున్నారు. ఓ ప్రణాళిక ప్రకారం పరిశ్రమలను తెరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎంఎస్ఎంఈ ఉద్యోగులకు పీఎఫ్ చెల్లింపులోనూ ఆంక్షలను మినహాయించాలని కోరుతున్నారు. ముఖ్యంగా... విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇచ్చినట్లైతే.... సూక్ష్మ పరిశ్రమలను నేరుగా ఆదుకున్నవారవుతారని చెబుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో కార్మికులకు చెల్లించిన వేతనాలనూ యాజమాన్యాలకు తిరిగి చెల్లించాలని పలువురు పారిశ్రామికవేత్తలు కేంద్రాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి