మామూలుగా తపాలా శాఖ నగదు సేవలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కరోనా వ్యాపిస్తున్నందున ఈ సేవలే జనానికి అక్కరకొచ్చాయి. తపాలా శాఖ అందిస్తోన్న ఆధార్ ఆధారిత నగదు సేవల నుంచి జనం ఈ నాలుగు నెలల్లో లక్షలకు లక్షలు డ్రా చేశారు. కావల్సినప్పుడల్లా.. వేలిముద్రతో నగదు ఇచ్చే పోస్టుమ్యాన్‌లను ఫోన్ చేసి ఇళ్లకే పిలుస్తున్నారు.
తపాలా శాఖ గతేడాది చివర్లో ఈ సేవలను ప్రారంభించింది. ఖాతా ఏ బ్యాంకుదైనా సరే ఆధార్‌తో అనుసంధానమైతే చాలు పోస్టుమ్యాన్ ఇంటికే వచ్చి వేలిముద్ర తీసుకుని నగదు ఇస్తారు. రోజుకు పదివేల వరకు ఖాతాల్లోని డబ్బు పొందొచ్చు. అదనంగా ఎలాంటి ఛార్జీలూ చెల్లించక్కర్లేదు. ఇతరులకూ పంపించొచ్చు. ఈ లావాదేవీలు లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున దీన్ని వినియోగించుకున్నారు. లాక్‌డౌన్ సడలింపులు వచ్చినా.. చాలామంది ఇప్పటికీ ఈ సేవల వైపే మొగ్గు చూపుతున్నారు.
లాక్‌డౌన్‌కు ముందు 8 నెలల్లో సగటున నెలకు 46వేల లావాదేవీలు జరగ్గా లాక్‌డౌన్ తరువాత నెలకు సగటున రెండు లక్షలకు పైగా జరుగుతున్నాయి. మార్చి 24 నుంచి ఇప్పటివరకు తపాలాశాఖ ద్వారా 7,96,051 ఆధార్ ఆధారిత నగదుసేవల లావాదేవీలు జరిగాయి.
కరోనా ఉన్నందున తపాలా శాఖపై ఆధారపడేవారు గతంతో పోలిస్తే పెరిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేసేందుకు సిబ్బందికి అవసరమైన తర్ఫీదునిచ్చాం. సామాజిక దూరంతోపాటు అన్ని రక్షణ చర్యలు పాటించి నగదును ఇంటికి తీసుకెళ్లి అందజేసేలా ఏర్పాట్లు చేశామని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ రామ్ తెలిపారు.
ఇదీ చూడండి. 'ఆ బిల్లులు చట్ట వ్యతిరేకం'.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ