కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామం నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో ఇసుక తవ్వకాలను ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ మేరకు టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఫలితంగా ఇసుక అక్రమార్కులు ఇదే అదునుగా భావిస్తూ భారీగా ఇసుక నిల్వ చేసి విక్రయించుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే ఉస్తేపల్లి గ్రామ పరిధిలోని కృష్ణా నది నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నారు.
టిప్పర్ ద్వారా తరలింపు..
టిప్పర్ ద్వారా చందర్లపాడు మండలం గుడిమెట్ల పరిధి అటవీ ప్రాంతంలోకి తరలించి అక్కడ భారీగా నిల్వ చేస్తున్నారు. అనంతరం ఇసుకను హైదరాబాద్‌తో పాటు వేర్వేరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనిపై పలువురు పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఒకే బిల్లుతో రోజంతా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఇసుక వేలాది టన్నులు తరలిస్తూ ప్రజా ఖజానాకు గండి కొడుతున్నారు.