IIT Hyderabad Report On Polavaram: పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి నిధుల సమస్య అత్యంత కీలకమైన కారణమని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల నివేదిక తేల్చి చెప్పింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు, ఖర్చు తీరు, కేంద్రం తిరిగి చెల్లించే (రీయింబర్స్‌మెంట్) విధానాలు, రెండో డీపీఆర్ ఆమోదించాల్సి ఉండటం వరకు అన్ని సమస్యలనూ ప్రస్తావించింది. 1.4.2014 నాటికి పోలవరం ప్రాజెక్టుకయ్యే వ్యయంలో 100 శాతం సాగునీటి విభాగం ఖర్చును కేంద్రమే భరిస్తుందంటూ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పింది. రాష్ట్రం తొలుత ఖర్చు చేస్తే.. ఆనక కేంద్రం ఆ నిధులను తిరిగి చెల్లిస్తోంది. 2018-19 నుంచి ఈ ప్రాజెక్టుపై నిధుల వెచ్చింపు బాగా తగ్గిపోయిందని నిపుణుల కమిటీ ప్రస్తావించింది. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అత్యంత తక్కువ ఖర్చు చేసింది 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే అనీ పేర్కొంది. ప్రాజెక్టు గుత్తేదారును మార్చాలని నిర్ణయించడం, రీటెండరింగ్ ప్రక్రియ తదితర కారణాలవల్ల ఆ ఏడాది ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందని వివరించింది.
పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశంలో మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఆ పరిధి దాటి సాగునీటి విభాగానికయ్యే ఖర్చును రాష్ట్రమే భరించాలి. పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటికి సాగునీటి విభాగానికయ్యే ఖర్చును 100 శాతం తిరిగి చెల్లిస్తామని కేంద్రం నిర్ణయించింది. 2017-18 ధరల ప్రకారం నిధులివ్వాలని రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2020 మార్చి 17న కేంద్రానికి సూచించింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలి.
2013-14 ధరల ప్రకారం 2021 ఆగస్టు నాటికి కేంద్రం రూ.4,067.44 కోట్లే రాష్ట్రానికి రీయింబర్స్ చేయాల్సి ఉంది. 2021 ఆగస్టు నాటికి కేంద్ర రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశాలను, ఇందులోని వివాదాలను నివేదిక ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,772.44 కోట్లు తిరిగి చెల్లించాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి బిల్లులు పంపింది. అందులో దాదాపు సగం (45.46 శాతం) బిల్లులు 2013-14 ధరల పరిధిని దాటి ఉండటంవల్ల చెల్లించలేమని తేల్చేసినవే. మరో 20.14 శాతం బిల్లులు ప్రాజెక్టుకు నిర్దేశించిన అంశాల పరిధిలోకి రానందున పోలవరం అథారిటీ తిరస్కరించింది. 18 శాతం బిల్లులే తిరిగి చెల్లింపునకు వీలుగా పోలవరం అథారిటీ కేంద్ర జల వనరులశాఖకు సిఫార్సు చేసింది. మరో 16.32 శాతం విలువైన బిల్లులు ఆ రోజు నాటికి పోలవరం అథారిటీ పరిశీలనలో ఉన్నాయి.
ఇవీ చదవండి: పోలవరంపై సీఎం జగన్ ఇప్పుడేం చెబుతారు ?: చంద్రబాబు